ఇంగ్లాండ్ వేదికగా జూన్ 18-22 వరకు తొలిసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ భారత్, కివీస్ మధ్య జరగనుంది. అయితే ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదు. ఉన్నది ఏకైక మ్యాచ్. మరి ఆ మ్యాచ్ సజావుగా సాగకుంటే పరిస్థితి ఏంటి? ఆ ఏకైక టెస్ట్.. డ్రా లేదా టై లేదా రద్దయితే ఏం చేయాలి. అందుకు మరో రిజర్వ్ తేదీ ఉంటుందా? అంటే ప్రస్తుతానికి అంతా అయోమయమే. అయితే వీటన్నింటికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.
తొలి సారి నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ మ్యాచ్కు సంబంధించి నియమ నిబంధనలను ఐసీసీ త్వరలోనే జారీ చేసే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. "ఇది ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ కాదు. ఆటకు సంబంధించి నియమ నిబంధనలు తెలియాలి. ముఖ్యంగా మనకు మూడు విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే, లేకుంటే టై అయితే.. ఇరుజట్ల మధ్య ఒక్క ఇన్నింగ్స్ సాగకుండా మ్యాచ్ పూర్తిగా రద్దైతే ఏంటి పరిస్థితి అన్న అంశాలపై ఐసీసీ త్వరలోనే నిబంధనలు వెల్లడించే అవకాశం ఉంది" అని ఆ అధికారి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'మరో మూడు జన్మలెత్తినా.. ఇండియాకే ఆడాలి'