వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్ ఉన్నట్లే టెస్టుల్లోనూ ప్రపంచ సమరం ఉండాలనే దశాబ్దాల ఆలోచనకు 2019లో శ్రీకారం చుట్టి.. దాదాపు రెండేళ్ల పాటు సుదీర్ఘ కాలం టెస్టు జట్ల మధ్య సిరీస్‌లు నిర్వహించి.. ఈ కాలంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ కోసం తుదిపోరుకు రంగం సిద్ధం చేసింది ఐసీసీ. అయితే ఇంత ప్రతిష్ఠాత్మక మ్యాచ్ సాగిన తీరు క్రికెట్ అభిమానులకు తీవ్ర అసహనమే కలిగించి ఉంటుంది. ఇక భారత అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు.
ఈ సమయంలో బాగా వర్షాలు పడే సౌథాంప్టన్ ఫైనల్‌కు వేదికగా ఎంచుకోవడం సరైన నిర్ణయమేనా అన్న సందేహాలు ముందు నుంచే ఉండగా.. అందుకు తగ్గట్లే మ్యాచ్‌కు వరుణుడు తీవ్ర స్థాయిలోనే ఆటంకం కలిగించాడు. తొలి నాలుగు రోజుల్లో కేవలం ఒకటిన్నర రోజుల ఆట మాత్రమే సాగడం వల్ల ఫైనల్ మీద ఆసక్తి సన్నగిల్లిపోయింది. అసలే టీమ్ ఇండియాకు ఈ మ్యాచ్ ముందు సరైన ప్రాక్టీస్ లేదు. క్వారంటైన్లో సుదీర్ఘ సమయం గడపాల్సిరావడం వల్ల సరైన ప్రాక్టీస్ లేకపోయింది. అదే సమయంలో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడింది. రెండు జట్ల సన్నద్ధతలో ఎంత తేడానో!
ఇలాంటి స్థితిలో మ్యాచ్లో అడుగుపెడితే.. వరుణుడి 'ఆట' కోహ్లీసేన మానసిక స్థితిని మరింతగా దెబ్బతీసింది. కివీస్ ఆటగాళ్లు కూడా ఇవే పరిస్థితులు ఎదుర్కొ న్నప్పటికీ.. వాళ్లకు ఇవి అలవాటే. న్యూజిలాండ్‌కు దగ్గరగా ఉండే ఇంగ్లాండ్‌లో ఫైనల్ జరగడం వారికి అతి పెద్ద సానుకూలాంశం. పైగా మ్యాచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి స్పిన్నర్‌కు అవకాశం ఇవ్వకుండా ఐదుగురు పేసర్లను ఎంచుకోవడం ఆ జట్టు పైచేయి సాధించడానికి తోడ్పడింది. మ్యాచ్‌కు ముందురోజు వరకు ఎండ కాస్తుండటం వల్ల భారత్ ఇద్దరు స్పిన్నర్లకు తుది జట్టులో చోటివ్వగా.. మ్యాచ్ రోజు నుంచి వరుణుడి ప్రతాపం మొదలై పేసర్ల రాజ్యమే నడిచింది. నాలుగో పేసర్ లేకపోవడం ఒకలోటైతే.. ప్రధాన పేసర్ బుమ్రా వైఫల్యం భారత్‌ను గట్టి దెబ్బేతీసింది. న్యూజిలాండ్ ఘనతను తక్కువ చేయడానికేమీ లేదు కానీ.. భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు, మ్యాచ్ జరుగుతున్నపుడు ఏదీ కలిసి రాలేదన్నది వాస్తవం. వరుణుడి ఆటంకాల మధ్య అనిశ్చిత వాతావరణంలో, గందరగోళ పరిస్థితుల్లో సాగిన మ్యాచ్లో గెలవడం కివీస్‌కూ అంతసంతృప్తినిచ్చి ఉండకపోవచ్చు.
ఒకటి సరిపోతుందా?
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతను తేల్చడానికి ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహించడం సరైందేనా అన్న చర్చ నడుస్తోందిప్పుడు. కొన్ని వారాల్లో ముగిసిపోయే వన్డే, టీ20 ప్రపంచకప్ చాంపియన్‌షిప్ రెండేళ్ల పాటు సాగే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేతను మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిర్ణయించాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అప్పుడు వర్షం పడినా.. ఒక మ్యాచ్ సజావుగా సాగకున్నా, ఒక మ్యాచ్ డ్రా అయినా ఇబ్బంది ఉండదని మాజీలు అంటున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ ఫలితం డ్రా అయ్యేందుకు అవకాశాలు లేకపోలేదు కానీ అప్పుడు విజేతను తేల్చడానికో విధానం తీసుకురావచ్చు. ఒక్క మ్యాచ్‌తో పోలిస్తే ఇది మెరుగైన ప్రత్యామ్యాయమని, ఇంతటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి మూడు మ్యాచ్‌ల సిరీస్ ఉంటే ఆసక్తికర ముగింపు ఉంటుందని అంటున్నారు.
ఇవీ చదవండి: