WTC Final 2023 : టీమ్ఇండియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు 'ఛెతేశ్వర్ పుజారా' పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్‌లో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా పుజారాను నియమించనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ బ్రిస్టల్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్న పుజారా.. 'ససెక్స్' జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శనతో రాణిస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతే కాకుండా 'ససెక్స్' జట్టు తరఫున రెండు సెంచరీలు చేశాడు. దీంతో పుజారా 'ససెక్స్'కు సారథ్యం వహిస్తున్న తీరును గమనించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
cheteshwar pujara test vice captain : ఇదివరకు భారత సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా సేవలు అందించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ అదరగొడుతున్నాడు. మళ్లీ చాలా రోజుల తర్వాత టీమ్ఇండియా జట్టులో పునరాగమనం చేయనున్నాడు. అయితే మరోసారి అతడే వైస్ కెప్టెన్‌గా ఉండ వచ్చునని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు 'పుజారా'నే టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడని ఒక ప్రకటనలో తెలిపారు. కానీ ఇప్పటివరకు పుజారా నియామకాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి మే 23 లోపు ఫైనల్‌లో ఆడే జట్టు వివరాలు సమర్పించాల్సి ఉంది. ఆ లోపు పుజారా పేరును వైస్ కెప్టెన్‌గా డిక్లేర్ చేయనున్నారని సమాచారం.
జూన్ 7-11 మధ్య ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టును బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించిన సెలక్టర్ల బృందం, వైస్ కెప్టెన్‌ను ప్రకటించలేదు.
కాగా మే 24 లోపు టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ సహా కీలక ఆటగాళ్లు ఇంగ్లాండ్‌కు చేరనున్నారు. పుజారా కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2 టోర్నీలో ఆడుతున్న కారణంగా కాస్త ఆలస్యంగా జట్టులోకి చేరనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, దిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు అక్షర్ పటేల్ ఈ నెలలోనే ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమ్ఇండియా జట్టు:
wtc final team india squad 2023 : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, షమి, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.