sports mothers with children: పురుషుల క్రికెట్లో నాన్నలు చాలామందే ఉంటారు. బిడ్డల ఆలనా పాలనా తల్లి చూసుకుంటుంటే.. తండ్రులు మైదానాలకు వెళ్లి క్రికెట్ ఆడటం మామూలే. కానీ మహిళా క్రికెటర్లు బిడ్డను కన్నాక ఆటలో కొనసాగాలంటే అంత తేలికైన విషయం కాదు. ఒకప్పుడైతే పెళ్లి చేసుకున్నా, బిడ్డకు జన్మనిచ్చినా మహిళా క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లే భావించేవారు. కానీ ఇప్పుడు వివాహ బంధంలోకి వెళ్లాక, తల్లి అయ్యాక కూడా ఆటలో కొనసాగుతున్నారు. బిడ్డల్ని వెంటబెట్టుకుని ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలకు కూడా వస్తున్నారు. మరి న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆడుతూ స్ఫూర్తిని పంచుతున్న తల్లుల విశేషాలు చూద్దాం..
పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్..
బిస్మా మరూఫ్.. ప్రస్తుత మహిళల వన్డే ప్రపంచకప్‌లో చర్చనీయాంశం అవుతున్న పేరు. మొన్న భారత్‌తో మ్యాచ్ అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే కనిపించాయి. ఆ ఫొటోల్లో తన కూతురితో పాటు భారత జట్టు సభ్యులూ ఉన్నారు. కేవలం ఆరు నెలల వయసున్న తన పాపను వెంట తీసుకుని ప్రపంచకప్ కోసం వచ్చింది బిస్మా. ప్రసవం తర్వాత ఇంత వేగంగా ఆటలోకి పునరాగమనం చేసి ప్రపంచకప్ ఆడటం అరుదైన విషయమే. నెలల బిడ్డ కావడంతో తనకు దూరంగా ఉంచలేక వెంట తీసుకునే న్యూజిలాండ్‌కు వచ్చేసింది. పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూంలోనూ బిస్మా కూతురికి ప్రత్యేక స్థానం కేటాయించారు. ఆ చిన్నారిని చూసి అందరూ ముచ్చటపడి ఫొటోలు దిగుతున్నారు. మిథాలీ సేన కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది.
ఇంకో ఏడుగురూ..
ప్రపంచకప్‌లో ఇంకో ఏడుగురు తల్లులున్నారు. అందులో ఒకే జట్టులో ఆడుతున్న ఓ జంట ఉండటం విశేషం. న్యూజిలాండ్ జట్టులో కీలకంగా ఉన్న ఆల్‌రౌండర్లు ఎమీ సాటర్త్‌వైట్, తహుహు జీవిత భాగస్వాములు కావడం విశేషం. 2017లోనే వీరి పెళ్లయింది. రెండేళ్ల కిందట వీరికో పాప పుట్టింది. తహుహు బిడ్డను కనగా.. ఆ సమయంలో ఎమీ కూడా క్రికెట్‌ను పక్కన పెట్టి ఇంటి వద్దే ఉంది. ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యులైన మెగాన్ షట్, రేచల్ హేన్స్ కూడా మహిళలనే పెళ్లాడారు. ఫాస్ట్‌బౌలర్ అయిన షట్.. హోలీవోక్ అనే దీర్ఘ కాల భాగస్వామిని 2019లో పెళ్లి చేసుకుంది. వీరికి గత ఏడాది బిడ్డ పుట్టింది. ఇక టాప్ ఆర్డర్ బ్యాటరైన రేచల్.. ఆస్ట్రేలియా మహిళల జట్టు మాజీ సభ్యురాలైన లియా పౌల్టన్‌ను కొన్నేళ్ల కిందటే పెళ్లాడింది. ఆ జంట కూడా నిరుడు ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
బ్యాటర్ లిజెలీ లీ కూడా..
దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాటర్ లిజెలీ లీ కూడా ఓ మహిళనే పెళ్లాడింది. అయితే ఆమె భాగస్వామి తాంజా క్రోనెకు క్రికెట్‌తో సంబంధం లేదు. వీరికి గత ఏడాది బిడ్డ పుట్టింది. బిడ్డను కన్నది తాంజానే అయినా.. లిజెలీ కూడా తల్లి పాత్రను పోషిస్తోంది. దక్షిణాఫ్రికా జట్టుకే చెందిన మసబాటా క్లాస్ కూడా ఓ బిడ్డకు తల్లే. తన బాయ్‌ఫ్రెండ్ ద్వారా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. వెస్టిండీస్ జట్టు సభ్యురాలైన ఎఫీ ఫ్లెచర్ కూడా మాతృ మూర్తే.
బోర్డులు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి..
ఇలా తల్లులుగా మారిన మహిళా క్రికెటర్లకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు బాగానే సహకారమందిస్తున్నాయి. కాంట్రాక్టుల విషయంలో ఉదారంగా వ్యవహరించడం, అవసరం మేరకు వారికి విరామం ఇవ్వడం, మళ్లీ ఆడాలనుకున్నపుడు జట్టులో చోటివ్వడం, బిడ్డలతో మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చినపుడు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం.. ఇలా తోడ్పాటునందిస్తున్నారు. తల్లిగా మారాక క్రికెట్ ఆడటంలో మానసిక, శారీరక, సామాజిక పరమైన ఇబ్బందులున్నప్పటికీ వాటిని అధిగమించి.. తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడటం తేలికైన విషయం కాదు. మామూలుగానే క్రికెట్లో ఎంతో శారీరక శ్రమ, ఒత్తిడి ఉంటుంది. అందులోనూ ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో అంటే చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి టోర్నీలో పోటీ పడి తమ సంకల్ప బలాన్ని చాటుతున్న తల్లులకు సలాం కొట్టాల్సిందే.
ఇదీ చదవండి: 'చిన్నప్పుడు బ్యాటర్ అవుదామనుకున్నా'