వెస్టిండీస్ క్రికెట్ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్, సీనియర్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇద్దరూ సోషల్‌మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. ఇటీవల సిమ్మన్స్ మాట్లాడుతూ.. "జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు ప్రాధాన్యత ఇస్తున్నారు" అని అన్నాడు. అలానే టీమ్‌కు ఆడాలని ఎవరినీ అడగబోమని కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనికి ఆండ్రూ రస్సెల్ ట్విటర్ వేదికగా స్పందించాడు. "ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకెప్పుడో తెలుసు. అయితే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే మేలు" అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న 'ది హండ్రెడ్ టోర్నమెంట్' సందర్భంగా మరోసారి ఆండ్రూ రస్సెల్ కీలక కామెంట్లు చేశాడు. తనను బలిపశువును చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తారని ముందే ఊహించానని చెప్పాడు.
"ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంటున్నా. ఇంతకుముందు జరిగిన చర్చల్లో చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. అందుకే ఇప్పుడు నన్ను చెడ్డవాడిగా చేసి.. బలిపశువులా బస్సు కిందకు తోసేయాలని చూస్తున్నారు. ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించా. విండీస్ జట్టుతో ఆడాలని, రెండు ప్రపంచకప్‌లను గెలవాలని ఉంది. అయితే అలాంటి అవకాశం ఉందని మాత్రం చెప్పలేను. నిజాయితీగా చెప్పాలంటే.. ఫ్రాంచైజీ తరఫున ఆడేటప్పుడు రెండు సెంచరీలు చేశా. ఇవి విండీస్ జట్టుకు ఆడినప్పుడు చేయాల్సినవి. అయితే ఇప్పుడు జమైకా తల్లాహస్‌కు ఆడటం ఎంతో ఎంజాయ్ చేశా. ఒకవేళ ఆ రెండు సెంచరీలు విండీస్ తరఫున చేసి ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉండేది. ఎప్పుడూ జట్టు కోసం ఆడాలనేదే నా కోరిక. అయితే కొన్ని నిబంధనలు అంగీకరించలేని పరిస్థితి. కనీసం నా నిబంధనలను గౌరవిస్తే బాగుండేది. మాకూ కుటుంబాలు ఉన్నాయి. కెరీర్‌లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా వయస్సు 34 ఏళ్లు. ఇప్పటికీ విండీస్ కోసం ప్రపంచకప్‌లను గెలిపించాలని భావిస్తున్నాఠ అని ఆండ్రూ రస్సెల్ వివరించాడు. విండీస్ తరఫున ఆండ్రూ రస్సెల్ తన చివరి వన్డే మ్యాచ్‌ను 2019లో ఆడగా.. ఆఖరి టీ20 గతేడాది ఆసీస్ మీద ఆడాడు. భారత టీ20 లీగ్ సహా పలు దేశీయ లీగుల్లో రస్సెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇదీ చూడండి: ఎఫ్టీపీ షెడ్యూల్ రిలీజ్, నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్‌లు