Virat kohli on his bad form: మూడేళ్లుగా సెంచరీ చేయకుండా సతమతమవుతున్న భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ నెల 27న యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలోనే తన బ్యాటింగ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం తన బ్యాటింగ్‌లో సమస్య ఎక్కడ ఉందో తెలియదన్నాడు. ఓ ఛానెల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. తన కెరీర్, ఫామ్ గురించి మీడియాతో పంచుకున్నాడు.
"నా ఆట ఎక్కడ ఉందో నాకు తెలుసు. ఎత్తుపల్లాలను ఎదుర్కొనే సామర్థ్యం లేకపోతే.. అంతర్జాతీయ కెరీర్లో ఇంత కాలంపాటు ప్రయాణించలేరు. నేను ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేను ఆ దశను దాటి వచ్చాను. 2014 ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆఫ్ సైడ్ పడ్డ బంతులను ఆడటమే నా సమస్య అని తెలుసు. కానీ, ఇప్పుడు సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుందో చూపించగలిగే ఒక్క కారణం లేదు. నేను ఒక్కసారి బ్యాటింగ్ బాగా చేస్తే చాలు.. తిరిగి ఫామ్‌లోకి వస్తాను. నేను నిలకడగా ఆడతానని తెలుసు, ఆడగలను కూడా. అలాంటి గడ్డు పరిస్థితిని తిరిగి తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. దాని నుంచి నేర్చుకుంటాను. ఒక క్రీడాకారుడిగా, మనిషిగా విలువలను నేర్చుకుంటాను."
-విరాట్ కోహ్లీ, భారత మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీ చివరిసారిగా జులైలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్నాడు. ఈ సిరీస్‌లోని రెండు వన్డేల్లో 16, 17.. రెండు టీ20ల్లో 1, 11 పరుగులు సాధించాడు. ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు విశ్రాంతినిచ్చారు. కోహ్లీ 2019 నవంబర్‌లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేశాడు. కాగా ఆగస్టు 28న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది భారత్. మరోవైపు విరాట్ కోహ్లీకి ఇది వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం.
ఇవీ చదవండి: రవిశాస్త్రి అలా అనడం కరెక్ట్ కాదన్న బెన్ స్టోక్స్