టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. తన భార్యతో కలిసి బెంగళూరు వీధుల్లో బ్యాడ్మింటన్ ఆడూతూ ఫ్యాన్స్‌ను అలరించాడు. రోజువారీ జీవితంలో క్రీడల ప్రాముఖ్యతను తెలపడానికి 'పుమా' ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'లెట్ దేర్ బి స్పోర్ట్స్' డ్రైవ్‌లో ఈ జంట పాల్గొన్నారు. పౌరులందరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వారిని ప్రోత్సహించారు. నగరంలోని ప్రీమియం రెసిడెన్షియల్ సొసైటీలో.. ఇద్దరు స్థానికులతో కలిసి విరుష్క జోడీ సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. క్రీడలు సరదా మాత్రమే కాకుండా.. మానసిక, శారీరక ఉల్లాసంతో పాటు ఫిట్‌నెస్‌ను అందిస్తాయనే సందేశాన్ని ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ మాట్లాడుతూ... 'ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు అంతర్భాగమై ఉండాలి. పుమా ఈ విషయాన్ని గుర్తించి 'లెట్ దేర్ బి స్పోర్ట్స్' కార్యక్రమాన్నినిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. డ్రైవ్‌లో పాల్గొనడానికి మా షెడ్యూల్‌ను అందుకు తగ్గట్లు మార్చుకున్నాం. ఈరోజు చాలా మంది మా నుంచి ప్రేరణ పొంది, క్రీడలు, ఫిట్‌నెస్‌ను వారి డైలీ లైఫ్‌లో అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నా' అని కోహ్లీ అన్నాడు. కాగా, విరాట్ 'పుమా ఇండియా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
'పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న వయస్సు నుంచే క్రీడలను కొనసాగించడం వల్ల దీర్ఘకాలం పాటు ఫిట్‌గా ఉంటారు. ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లను స్వీకరించడం... బెంగళూరు ప్రజలతో గడపడం చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు విరాట్‌తో కలిసి స్పాంటేనియస్‌గా బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడడాన్ని ఆస్వాదించాను' అని అనుష్క చెప్పింది.
'క్రీడలు, ఫిట్‌నెస్ ఈ రెండు అంశాలను రోజువారీ జీవితంలో కచ్చితంగా అలవర్చుకోవాలి. ప్రజలకు ఫిట్‌నెస్, క్రీడల పట్ల ఆసక్తిని కలగజేయడానికి పుమా నిరంతరం వారికి తోడ్పడుతుంది. ఈ ఈవెంట్ ద్వారా విరాట్, అనుష్క.. వినియోగదారులను మాకు వ్యక్తిగతంగా దగ్గర చేశారు. నేడు దేశంలో విరాట్ అనుష్క యూత్ ఐకాన్‌లు. ఈరోజు వారు సొసైటీ నివాసులతో మమేకమైన తీరు అన్ని వయసుల వారికి క్రీడలు, ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తుంది' అని పుమా భారత, సౌత్ఈస్ట్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ అన్నారు.
'గత 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో భారతదేశం క్రీడలు, ఫిట్‌నెస్ విషయంలో బాగా అభివృద్ది చెెందింది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి 'లెట్ దేర్ బి స్పోర్ట్స్' లాంటి డ్రైవ్ లాంటి ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించడం.. దేశంలో ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్‌గా మా బాధ్యత. మాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో ఫిట్ ఇండియాను నిర్మించాలనే మా లక్ష్యాన్ని సాధించగలమని మాకు నమ్మకం కుదిరింది' అని గంగూలీ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: