Virat Kohli SA Test: దక్షిణాఫ్రికాతో మంగళవారం నుంచి జరగబోయే మూడో టెస్టుకు సిద్ధమైంది టీమ్ఇండియా. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. తద్వారా సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు ఆటగాళ్లు. గాయంతో రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు ఫిట్నెస్ సాధించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు.
"నేను పూర్తి ఫిట్‌గా ఉన్నా. సిరాజ్ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. సిరాజ్ విషయంలో రిస్క్ తీసుకోలేం. అందుకే అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉండట్లేదు. సిరాజ్ స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకోవాలన్న విషయమై నేను, కోచ్, వైస్ కెప్టెన్ చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బెంచ్ స్ట్రెంత్ కూడా బలంగా ఉంది. అందువల్ల మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మాకు గర్వకారణం."
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
జోహెనస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ వీరోచిత పోరాటంతో మ్యాచ్‌ను వారి వైపు తిప్పుకొన్నాడు. దీంతో భారత్ ఒత్తిడిలో పడిపోయింది. మూడో మ్యాచ్ జరగబోయే కేప్‌టౌన్‌లో టీమ్ఇండియాకు గొప్ప రికార్డేమీ లేదు. దీంతో గెలుపు కోసం కోహ్లీసేన తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.