Vijay Hazare Trophy 2021: వచ్చే ఏడాది జనవరిలో ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు దేశవాళీ ఆటగాళ్లకు సువర్ణావకాశం. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బుధవారం ప్రారంభంకానుంది. ఈ వన్డే టోర్నీలో సత్తాచాటే ఆటగాళ్లను ఫ్రాంచైజీలు భారీ మొత్తంతో కొనుక్కునే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోని హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్‌లు విజయ్ హజారెలో సత్తాచాటి వేలంలో ధర పెంచుకోవాలని భావిస్తున్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అత్యధిక పరుగుల వీరుడు తన్మయ్ అగర్వాల్ (334 పరుగులు), అత్యధిక వికెట్లు తీసిన సి.వి.మిలింద్ (18 వికెట్లు) వన్డే టోర్నీలోనూ రాణించాలని కోరుకుంటున్నారు. దేశవాళీ టీ20లో సత్తాచాటిన ఈ ఇద్దరు హైదరాబాదీలపై ఫ్రాంఛైజీలు దృష్టిసారించాయి. ఆంధ్ర జట్టు నుంచి యువ బ్యాటర్ నితీశ్ కుమార్‌రెడ్డి.. పేసర్లు హరిశంకర్‌రెడ్డి, స్టీఫెన్‌లు ఈ టోర్నీలో తమదైన ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు విజయ్ హజారేలో ఆంధ్ర తరఫున బరిలో దిగుతున్నాడు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో హరియాణాతో హైదరాబాద్, ఒడిషాతో ఆంధ్ర తలపడనున్నాయి.
హార్దిక్ దూరం
Hardik Pandya Vijay Hazare Trophy: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విజయ్ హజారె ట్రోఫీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పూర్తిస్థాయి బౌలింగ్ ఫిట్‌నెస్ సాధించడం కోసమే హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. "విజయ్ హజారె ట్రోఫీకి అందుబాటులో ఉండగలవా అంటూ హార్దిక్‌కు బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) ఇమెయిల్ పంపింది. గత మూడేళ్లలో బరోడా తరపున అతను చాలా అరుదుగా ఆడాడు. అయితే ప్రస్తుతం తాను ముంబయిలో ఫిట్‌నెస్ శిబిరంలో ఉన్నట్లు ఒకే ఒక్క లైన్‌లో అతను బదులిచ్చాడు. హార్దిక్‌కు ఎలాంటి గాయమైందో బీసీఏకు కూడా తెలియదు" అని బీసీఏ అధికారి తెలిపాడు.