Asiacup 2022 teamindia vs Hongkong ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటికే పాకిస్థాన్‌పై గెలిచి జోరుమీదున్న భారత్.. పసికూన హాంకాంగ్‌పై 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ సూపర్-4కు దూసుకెళ్లింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్) విశ్వరూపం ప్రదర్శించగా, కోహ్లీ(59 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో బాబర్ హయత్(41) టాప్ స్కోరర్. భారత జట్టులో భువనేశ్వర్‌కుమార్, అర్ష్‌దీప్‌సింగ్, జడేశా, అవేశ్‌ఖాన్ తలో వికెట్ తీశారు. సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు రెండో ఓవర్ చివరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 12 పరుగుల వద్ద అర్ష్‌దీప్ బౌలింగ్‌లో యాసిమ్ ముర్తజా ఔటయ్యాడు. అనంతరం నిజఖత్ ఖాన్(10)తో జట్టు కట్టిన బాబర్ హయత్(41: 35 బంతుల్లో 3x4, 2x6) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు. క్రమంగా వేగం పెంచుతూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 6 ఓవర్ చివరి బంతికి నిజఖత్ ఖాన్ రనౌట్ అయ్యాడు. ఈ ఓవర్లో హాంకాంగ్ 17 పరుగులు రాబట్టింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 51 పరుగులతో మెరుగైన స్థితిలో ఉంది. అనంతరం వచ్చిన కించిత్ షా(30: 28 బంతుల్లో)తో కలిసి బాబార్ హయత్ ఇన్నింగ్స్‌ను నిర్మించే క్రమంలో 74 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో హయత్ ఔట్ కావడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోయింది. దీంతో హాంకాంగ్ ఏ దశలోనూ కోలుకోలేకుండా పోయింది. బాబర్ అనంతరం క్రీజులోకి వచ్చిన అజిజ్ ఖాన్(14) జట్టు స్కోర్ 105 పరుగుల వద్ద అవేశ్‌ఖాన్‌కు చిక్కాడు. దీంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 116 పరుగుల వద్ద ఐదో వికెట్ రూపంలో కించిత్ ఖాన్ కూడా ఔట్‌కావడంతో ఆ జట్టు ఓటమి దాదాపు ఖాయమైంది. చివర్లో జీషన్ అలీ(26 నాటౌట్), స్కాట్(16) మరో వికెట్ పడకుండా ఉండి ఓటమి పరుగుల అంతరాన్ని తగ్గించారు.
సూర్యకుమార్ మెరుపులు.. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన రాహుల్, రోహిత్‌లు తొలుత ఆవేశపడకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశారు. దీంతో తొలిఓవర్‌లో ఐదు పరుగులు, రెండో ఓవర్‌లో కేవలం ఒకే పరుగు వచ్చింది. అయితే మూడో ఓవర్‌లో వీరిద్దరూ హాంకాంగ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో విరుచుకుపడ్డారు. దీంతో ఈ ఒక్కఓవర్‌లోనే 22 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 4.5 ఓవర్ల వద్ద రోహిత్ శర్మ(21: 13 బంతుల్లో) ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 38 పరుగులు. అనంతరం క్రీజులో వచ్చిన కోహ్లీ(59 నాటౌట్: 44 బంతుల్లో 1x4, 3x6) రాహుల్(36: 39 బంతుల్లో 2x6)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ క్రమంలో భారత్ పది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 70 పరుగులతో నిలిచింది. ఇక వేగంగా ఆడే క్రమంలో 13 ఓవర్ చివరి బంతికి రాహుల్ ఔటయ్యాడు. అప్పటికీ భారత్ స్కోరు 94 పరుగులు. రాహుల్ వెనుదిరగడంతో క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. వచ్చిరావడంతో సూర్యకుమార్ ప్రత్యర్థి బౌలర్లపై వీరవిహారం చేశాడు. బౌండరీలతో వారిని బెంబేలెత్తించాడు. కోహ్లీ కొంచెం నెమ్మదిగా ఆడినప్పటికీ సూర్యకుమార్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్ధశతకాలు సాధించారు. సూర్యకుమార్ 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో హాంకాంగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరి బాదుడుకు భారత్ చివరి 5 ఓవర్లలో 78 పరుగులు రాబట్టింది.
ఇదీ చూడండి: గణేష్ చతుర్థి విషెస్‌తో మనసు దోచేసిన వార్నర్