Raina Retirement : టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతడు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికినట్లు అయింది. "ఇన్నేళ్ల పాటు ఈ దేశానికి, నా రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా. నా సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, చెన్నై టీం, రాజీవ్ శుక్లా సర్, నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అని రైనా సోషల్‌మీడియాలో రాసుకొచ్చాడు.
2005లో వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రైనా.. టీమ్ఇండియా తరఫున 266 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 7,988 పరుగులు నమోదు చేయగా.. ఒక్క వన్డేల్లోనే 5615 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 116 పరుగులు చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ మొత్తం ఐదు సెంచరీలు, 36 అర్ధశతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 36 వికెట్లు కూడా తీశాడు. 2010లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రైనా.. 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది.
భారత మెగా క్రికెట్ లీగ్‌లో తొలుత పంజాబ్ జట్టుకు ఆడిన రైనా.. ఆ తర్వాత చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడిన అతడు 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 అర్ధశతకాలు ఉన్నాయి. 25 వికెట్లు కూడా తీశాడు. 2020లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీ20 మెగా లీగ్‌లో వీరిద్దరూ కలిసి చెన్నై జట్టుకు ఆడిన విషయం తెలిసిందే.
అయితే రెండేళ్లుగా రైనా సరైన పోటీ క్రికెట్ ఆడటం లేదు. 2020లో కరోనా సమయంలో టీ20 మెగా లీగ్ 13వ సీజన్‌ను యూఏఈలో నిర్వహించగా.. చెన్నై జట్టుతో కలిసి అక్కడకు వెళ్లిన రైనా కొద్ది రోజులకే భారత్‌కు తిరిగివచ్చాడు. వ్యక్తిగత కారణాలతో ఆ సీజన్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత 2021 సీజన్‌లో పూర్తిగా తడబడ్డాడు. ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం 160 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో 2022 ఆరంభంలో జరిగిన మెగా వేలానికి ముందు రైనాను చెన్నై వదిలేసింది. వేలంలోనూ అతడిపై ఆసక్తి చూపించలేదు. అయితే ఈ వేలంలో అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: నాదల్కు షాక్.. ఆ కుర్రాడి చేతిలో ఘోర పరాజయం