Team India WTC Points Table : దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఐదో స్థానానికి దిగజారిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో టీమ్ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది. కానీ ఓటమితో ఇప్పుడు భారత్ పాయింట్ల శాతం ఏకంగా 44.44కు పడిపోయింది.
టాప్‌లో దక్షిణాఫ్రికా
కాగా, ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో టాప్కు చేరుకుంది. సౌతాఫ్రికా తర్వాతి స్థానాల్లో వరుసగా పాకిస్థాన్ (61.11), న్యూజిలాండ్(50.0) జట్లు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 41.67 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో ఉంది.
రెండో టెస్టులో భారత్ విజయం సాధిస్తే!
అయితే పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరే ఛాన్స్ ఉంది. అదే విధంగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధిస్తే తమ స్థానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.
టీమ్ఇండియాకు ఫైన్
సౌతాఫ్రికా పర్యటనలో తొలి టెస్టు ఓడి నిరాశలో ఉన్న టీమ్ఇండియాకు షాక్ తగిలింది. నిర్దేశించిన సమయం కంటే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 2 ఓవర్లు వెనకబడింది. దీంతో ఐసీసీ రూల్స్ ఆర్టికల్ 2.22 ప్రకారం భారత్ ప్లేయర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది. అంతేకాకుండా డబ్ల్యూటీసీ 2023-25 టేబుల్లో టీమ్ఇండియాకు రెండు మైనస్ పాయింట్లు విధించారు. ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున, రెండు మైనస్ పాయింట్లు టీమ్ఇండియా ఖాతాలో చేరినట్లు ఐసీసీ వెల్లడించింది.
రోహిత్ చెత్త రికార్డు
మరోవైపు, ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్ బౌల్డయ్యాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో టెస్టు క్రికెట్లో డకౌటైన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉన్నాడు. 2011 ప్రోటీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోనీ డకౌట్‌గా వెనుదిరిగాడు. తాజా మ్యాచ్‌తో రోహిత్ కూడా ఈ జాబితాలోకి చేరాడు. కాగా టెస్టుల్లో హిట్ మ్యాన్‌ను రబాడ ఔట్ చేయడం 14వ సారి కావడం గమనార్హం.