Zaheer advises Rahane: ఫామ్ అందిపుచ్చుకునేందుకు అజింక్యా రహానేకు ఒకే ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుందని టీమ్‌ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. అయితే రహానెపై తీవ్ర ఒత్తిడి ఉందని, దానిని అధిగమించేందుకు దక్షిణాఫ్రికా పర్యటన మంచి వేదికని తెలిపాడు.
"రహానే ఎంతో ఒత్తిడితో ఉన్నాడనే కాదనలేని సత్యం. అందుకే మానసికంగా దృఢంగా ఉండాలి. ఫామ్‌లోకి రావాలంటే ఒక్క ఇన్నింగ్స్ చాలనే నమ్మకం పెంచుకోవాలి. ఎలాంటి క్రికెటర్‌కైనా ఆత్మవిశ్వాసం ముఖ్యం. అజింక్యా రహానే విదేశాల్లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. అదే అతడికి సానుకూలాంశం."
-జహీర్ ఖాన్, టీమ్ఇండియా మాజీ పేసర్
న్యూజిలాండ్‌తో సిరీస్ వరకు టీమ్‌ఇండియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా రహానే ఉండేవాడు. బ్యాటర్‌గా విఫలం కావడం వల్ల రహానేను ఉపసారథ్యం పోయింది. దక్షిణాఫ్రికా పర్యటనకు విరాట్‌కు రోహిత్‌ను డిప్యూటీగా బీసీసీఐ నియమించింది. అయితే రోహిత్ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరం కాగా.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో బ్యాటర్‌గానూ రహానే విఫలమైతే జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకమే.