అఫ్గానిస్థాన్‌లో ఆందోళనల(Afghanistan Crisis) నేపథ్యంలో దేశ క్రికెట్ భవిష్యత్ గురించి తాలిబన్లు తొలిసారి స్పందించారు. ఐసీసీ ప్రణాళిక ప్రకారం అఫ్గాన్ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌లకు తాము అంతరాయం కలిగించబోమని ఓ ప్రకటనలో తెలియజేశారు.
"అఫ్గాన్ క్రికెట్ టీమ్ అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు తాము ఎలాంటి అంతరాయం కలిగించబోము. ప్రణాళిక ప్రకారం జరగాల్సిన మ్యాచ్‌లకు మేము వ్యతిరేకం కాదు. అంతేకాకుండా భవిష్యత్‌లో ప్రపంచదేశాలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవాలని ఆశిస్తున్నాం. అఫ్గాన్ క్రికెటర్లు విదేశాలకు వెళ్లి మ్యాచ్‌లు ఆడొచ్చు. అదే విధంగా ఇతర దేశాల క్రికెట్ టీమ్‌లు ఇక్కడికి(అఫ్గానిస్థాన్) వచ్చి సిరీస్‌లలో పాల్గొనవచ్చు".
- అహ్మదుల్లా వాసిఖ్, తాలిబన్ కల్చర్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్
ఇటీవలే పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉండగా.. అఫ్గాన్‌లో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఆ సిరీస్‌ను నిరవధిక వాయిదా వేశారు. ఆగస్టు 15న అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు(Taliban Occupied Kabul) ఆక్రమించారు. అంతటితో అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి స్వస్తి పలికినట్లైంది.
నవంబరులో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌ను నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన చేసింది. యూఏఈ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ సిరీస్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి అఫ్గాన్ క్రికెట్ జట్టను ఆస్ట్రేలియాకు చేరుకోవాల్సిన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సీఏ తెలిపింది.
అయితే తొలిసారి అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన సమయంలో వినోద కార్యక్రమాలను నిషేధించారు. ఈ క్రమంలో క్రికెట్‌పై నిషేధం పడింది. కానీ, ప్రస్తుతం అంతర్జాతీయ దేశాల జట్లతో క్రికెట్ ఆడేందుకు వారు అనుమతించారు.
ఇదీ చూడండి.. 'అప్పుడే ఆట అయిపోలేదు.. ఇప్పటికైనా గెలుస్తాం'