టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని సాధించి టోర్నీలో శుభారంభం చేసిన టీమిండియా సిడ్నీ వేదికగా రెండో మ్యాచ్ కోసం సిద్ధమైంది. పసికూన నెదర్లాండ్స్‌తో భారత జట్టు పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్ని సాధించడం ద్వారా తదుపరి దక్షిణాఫ్రికాతో జరిగే పోరులో ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో కూడా భారత్ బరిలోకి దిగనున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆటగాళ్లు ఎవరికీ విశ్రాంతి ఇవ్వబోమని తెలిపింది. పాకిస్తాన్‌పై పెద్దగా పరుగులు చేయని టాప్ ఆర్డర్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా నిలకడలేమి కేఎల్ రాహుల్‌ను వేధిస్తోంది. సిడ్నీలో ఇంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 200కిపైగా పరుగులు చేసింది. పెద్దగా అనుభవం లేని నెదర్లాండ్స్ బౌలింగ్‌పై టీమిండియా కూడా 200కిపైగా పరుగులు చేయాలని కోరుకుంటోంది.
టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయడానికే టీమిండియా ప్రాధాన్యం ఇవ్వవచ్చు. పాకిస్తాన్‌తో జరిగిన పోరులో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాస్త అసౌకర్యానికిలోనైన హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. మరోవైపు కెప్టెన్ రోహిత్‌శర్మ ఇటీవల కాలంలో స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడం టీమ్ఇండియాను ఆందోళనకు గురి చేస్తోందని క్రికెట్ దిగ్గజం గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్ శర్మ ఫామేనని తెలిపారు. ఉదాసీనతకు తావివ్వకుండా నెదర్లాండ్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేయాలని భారత జట్టు కృతనిశ్చయంతో ఉంది. టోర్నీలో విజయపరంపరను కొనసాగించాలని కోరుకుంటోంది. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం పన్నెండున్నరకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి: T20 worldcup: రోహిత్ శర్మ ఎందుకలా చేస్తున్నాడో