T20 World Cup Zim Vs Ban: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్ 12 దశలో చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన పోరులో జింబాబ్వేపై బంగ్లాదేశ్ విజయం సాధించింది. గెలుపు కోసం చివరి దాకా పోరాడిన జింబాబ్వే.. కేవలం 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. జింబాబ్వే పోరాడి ఓడిపోయినా.. అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో హైడ్రామా జరిగింది. అదేంటంటే..
ఆఖరి ఓవర్లో హైడ్రామా..
జింబాబ్వే గెలవడానికి చివరి 6 బంతులకు 16 పరుగులు చేయాల్సిన దశలో మొసాద్దిక్ ఈ ఓవర్‌ను వేశాడు. తొలి బంతి లెగ్‌బైగా వెళ్లింది. రెండో బంతికి బ్రాడ్ ఇవాన్స్ ఔట్ అయ్యాడు. భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి డీప్ మిడ్ వికెట్‌లో అఫీఫ్ హొస్సేన్ చేతికి చిక్కాడు. మూడో బంతికి లెగ్‌బై రూపంలో నాలుగు పరుగులొచ్చాయి. నాలుగో బంతికి ఎన్‌గరవ సిక్స్ బాదాడు. అయిదో బంతిని కూడా భారీ షాట్ ఆడటానికి క్రీజ్‌ను వదిలి ముందుకొచ్చాడు. బంతి మిస్ కావడంతో నేరుగా వికెట్ కీపర్ నూరుల్ హసన్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో అతు బెయిల్స్‌ను ఎగురగొట్టి ఎన్గరవను పెవిలియన్ పంపించాడు.
విన్ కాదు నోబాల్..
ఆరోబంతి మ్యాచ్ మొత్తానికీ హైలైట్‌గా నిలిచింది. మొసాద్దిక్ వేసిన బంతిని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి.. ముజరబని టైమింగ్ మిస్ అయ్యాడు. క్రీజ్ నుంచి బయటికొచ్చాడు. అక్కడ బంతి మిస్ అయింది. దీంతో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నురుల్ హసన్ స్టంప్ ఔట్ చేశాడు. నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ప్లేయర్లందరూ విన్నింగ్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా తమ స్టాండ్లు వదిలి వెళ్తున్నారు.
మ్యాచ్ ఇంకా అయిపోలేదు..
ఇంతలో ఫీల్డ్ వదిలి వెళ్తున్న జింబాబ్వే బ్యాటర్లను మళ్లీ బ్యాటింగ్ చేయమని ఓ పిలుపు వచ్చింది. ఎందుకంటే బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నురుల్ హసన్ క్లీయర్ స్టంప్ ఔట్ చేశాడని అందరూ అనుకున్నారు. కానీ అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించాడు. బంతిని అందుకునే సమయంలో కీపర్ నూరుల్ హసన్ గ్లోవ్స్ స్టంప్స్‌ను దాటి ముందుకొచ్చాయి. కీపర్ గ్లోవ్స్ స్టంప్స్‌ను దాటి వచ్చిన సమయంలో ఐసీసీ రూల్స్ ప్రకారం ఆ బంతిని నో బాల్‌గా గుర్తించాల్సి ఉంటుంది. అంపైర్ అదే చేశాడు. దీంతో బ్యాటర్ ముజరబని మళ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. కానీ నోబాల్ ఫ్రీహిట్ బంతిని స్కోర్ చేయలేకపోయాడు జింబాబ్వే బ్యాటర్. దీంతో 3 పరుగుల తేడాతో జింబాబ్వే ఓటమి పాలైంది.
జింబాబ్వే సూపర్ ఇన్నింగ్స్..
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ షాంటో(71) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జింబాబ్వే బౌలర్లు ఎంగరవ(2), ముజరబాణి(2), రజా(1), సీన్ విలియమ్స్(1) వికెట్లు తీశారు.
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే అద్భుత ప్రదర్శన చేసింది. మొదట తడబడినా ఆ తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఆఖరి ఓవర్లలో ఒత్తిడికి గురైనా.. జింబాబ్వే టెయిలెండర్లు మ్యాచ్‌ను గెలుపు దిశగా తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. 20వ ఓవర్లో చివరి బంతి నోబాల్ అయినప్పటికీ.. జింబాబ్వే విజయతీరానికి చేరలేకపోయింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్(64) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. చకబ్వా(15), రియాన్ బర్ల్(27) ఫర్వాలేదనిపించారు.
ఇవీ చదవండి : పాకిస్థాన్ బౌలర్ రాకాసి బౌన్సర్.. పగిలిన నెదర్లాండ్స్ బ్యాటర్ ముఖం!
సఫారీలతో మ్యాచ్.. భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. మరో 28 పరుగులు చేస్తే.