క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన 'కెప్టెన్స్ డే' కార్యక్రమంలో 16 మంది సారథులు పాల్గొన్నారు. మెగా టోర్నీకి వారు ఎలా సిద్ధమయ్యారో వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఐసీసీ ట్విటర్‌లో పంచుకుంది. 'ఒకే ఫ్రేమ్‌లో 16 మంది కెప్టెన్లు..' అంటూ రాసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో కెప్టెన్లు సెల్ఫీ తీసుకుని సందడి చేశారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. జట్టు సన్నద్ధత గురించి వివరించారు. అలాగే దాయాది పాక్‌తో జరిగే హైవోల్టేజ్ మ్యాచ్‌పై కూడా మాట్లాడారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-12 సమరానికి ముందు తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆదివారం నుంచి ఈ రౌండ్ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. సూపర్-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఇప్పటికే అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా సూపర్-12కు అర్హత సాధించాయి. అర్హత రౌండ్లో గ్రూప్- ఎ లో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ, గ్రూప్- బి లో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడనున్నాయి. గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసే సరికి ఒక్కో గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-12లో ఆడే ఛాన్స్ కొట్టేస్తాయి. ఈ నెల 22 నుంచి సూపర్-12 సమరం మొదలవుతుంది.
ఇదీ చూడండి: T20 worldcup: కోహ్లీపై.. ఏ మంత్రం పని చేసిందో?