శ్రీలంక, న్యూజిలాండ్ లాంటి జట్లపై అలవోక విజయాలను అందుకున్న టీమ్ ఇండియా. ఇప్పుడు ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు సిద్ధమౌతోంది. భారత్‌తో నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇండియాలో ఎప్పుడో ల్యాండ్ అయ్యింది. బెంగళూరు వేదికగా టెస్టు సిరీస్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఈ సిరిస్ గురించి మాజీ ప్లేయర్ సునీల్ గావస్కర్ పలు వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే..
తిరుగులేని ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తుది జట్టుకు ఎంపిక కావడం మామూలుగా జరిగిపోవాలి. కానీ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ల రూపంలో ముందు నుంచి ఆడుతున్న ఓపెనర్లుండగా గిల్‌ను ఎక్కడ ఆడించాలన్నది ప్రశ్న. రాహుల్ కొంత విరామం తర్వాత వస్తున్నాడు కాబట్టి అతనే బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన ఆడొచ్చు.
శ్రేయస్ ఫిట్‌గా ఉంటే రాహుల్ వికెట్ కీపింగ్ కూడా చేస్తూ దిగువన బ్యాటింగ్ చేస్తే మిడిలార్డర్ బలోపేతం అవుతుంది. భారత జట్టు తరఫున అరంగేట్రం కోసం దీర్ఘ కాలంగా ఓపికతో వేచి చూస్తున్న కేఎస్ భరత్‌కు ఇంకా అవకాశం ఇవ్వకపోవడం కఠినమైన నిర్ణయమే. కానీ కొన్నిసార్లు జట్టు సమీకరణాల వల్ల ఇలాంటి నిర్ణయాలు తప్పవు. అయ్యర్ ఫిట్‌గా లేకుంటే భరత్‌కు తుది జట్టులో చోటిచ్చే వీలుంటుంది. బంగ్లాదేశ్‌లో అశ్విన్‌తో కలిసి అయ్యర్ చూపిన పట్టుదల ప్రశంసనీయం. ఆస్ట్రేలియాపైనా మన వాళ్లు ఇలాంటి పట్టుదలే చూపాలి.
పిచ్‌ల గురించి అదే పనిగా మాట్లాడడం ఆసీస్ వ్యూహంలో భాగం. బ్రిస్బేన్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. మరి ఆ మ్యాచ్‌కు సిద్ధం చేసిన పిచ్ సంగతేంటి? అలాంటి పిచ్‌పై ఆడడం ఆటగాళ్ల ప్రాణాలకే ప్రమాదం. స్పిన్ పిచ్‌ల వల్ల పోయేది ప్రాణాలు కాదు, ఆటగాళ్ల పేరు మాత్రమే. బ్రిస్బేన్ పిచ్‌పై ఆడుతున్నపుడు ఇరు జట్ల బ్యాటర్ల గుండెలు నోట్లోకి వచ్చేశాయి. క్రికెట్ బ్యాట్స్‌మన్ ఆటగా మారిపోయిందని, కాబట్టి బౌలర్లకూ అవకాశం ఇవ్వాలని ఆసీస్ మీడియా ఇలాంటపుడు సాకులు వెతకడం మామూలే. కానీ భారత్‌కు వచ్చేసరికి తొలి రోజే బంతి తిరగడం గురించి అభ్యంతరాలు మొదలవుతాయి.
టెస్టు మ్యాచ్‌లో స్పిన్ ఆడడమే ఒక బ్యాటర్‌కు ఉత్తమ సవాలు. టర్న్ అయ్యే బంతులు బ్యాటర్ ఫుట్‌వర్క్‌ను పరీక్షిస్తాయి. అందుకే ఉపఖండంలో ఎక్కువ సెంచరీలు సాధించే ఆటగాడిని ఉత్తమ బ్యాటర్‌గా పరిగణిస్తారు. గత పర్యటనలో స్టీవ్ స్మిత్ పుణెలో టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఉత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటనదగ్గ సెంచరీ సాధించాడు.
ఈసారి అతను స్పిన్నర్లను ఎలా ఆడతాడో చూడాలి. మొత్తంగా భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌పై క్రికెట్ ప్రపంచం అమితాసక్తితో ఉందన్నది మాత్రం వాస్తవం. ఇక అండర్-19 ప్రపంచకప్‌ను భారత అమ్మాయిలు సాధించడం, వారికి బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించడం హర్షణీయం. అమ్మాయిలు ఆటల్లో పడి సమయం వృథా చేసుకుంటున్నారని ఇంకెవరూ అనలేరు.