దేశంలో కరోనా ఆరంభం నుంచి ఆకలి కష్టాలు ఎదుర్కొంటున్న నిరుపేదలకు తాము అందిస్తున్న సేవల గురించి చెప్పుకొచ్చారు ఈ క్రీడామణులు.
ఊపిరిలూదాలని..!
ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడి కోలుకుందీ టెన్నిస్ స్టార్. కరోనా కారణంగా చనిపోతున్న వారిని చూసి కదిలిపోయింది. కెట్టో.ఆర్గ్‌తో కలిసి ‘ఓటూ ఫర్ యూ’ పేరిట నిధులను సేకరిస్తోంది. వీటి ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తారు. ‘కొవిడ్ సెకండ్ వేవ్ దేశంపై బాగా ప్రభావం చూపింది. ఎంతోమంది ఆక్సిజన్ స్థాయులు పడిపోయి చనిపోతున్నారు. ఆసుపత్రుల బయట చికిత్స కోసం ఎదురు చూసే వారిని చూస్తే చాలా బాధేస్తోంది. బాధితుల బంధువులు ఆసుపత్రిలో పడక, ఆక్సిజన్ సిలిండర్లు, ఖరీదైన మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ నావంతుగా సాయం చేయడానికి కెట్టో.ఆర్గ్‌తో పనిచేస్తున్నా’నంది సానియా.
ఇప్పుడే కాదు.. గత ఏడాదీ లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్నవారిని ఆదుకోవడానికీ నిధులు సేకరించింది. యూత్ ఫీడ్ ఇండియా, సఫా ఇండియాతో కలిసి వారంలోనే రెండున్నర కోట్ల రూపాయలను సేకరించింది. వీటి ద్వారా జీవనాధారం కోల్పోయిన లక్షమందికి ఆహారాన్ని అందించింది.
నిత్యావసర వస్తువులను అందిస్తోంది
విమెన్స్ టెస్ట్, వన్ డే క్రికెట్ మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి అవసరమైన వారికి వంట సరుకులను అందిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉపాధి కోల్పోయినవారు, ఆటోడ్రైవర్లకు వాటితో పాటు కొంత నగదునూ అందిస్తోంది. ప్రస్తుతం మిథాలీ ఇంగ్లండ్ టూర్‌లో ఉంది. కానీ తన తరఫున ఆమె నాన్నతో సరుకులు సరఫరా చేయిస్తోంది. వాళ్ల అమ్మ కూడా ఇందులో భాగస్వామ్యం పంచుకుంటోంది. గతేడాదీ మిథాలీ రూ. 10 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధులకు విరాళమిచ్చింది. క్యాబ్ డ్రైవర్లు, చిన్నచిన్న అమ్మకం దార్లకు నిత్యావసర వస్తువులను అందించింది. ‘నిజానికి నేను ఓ ప్రాజెక్టు ప్రణాళికలో ఉన్నాను. లాక్‌డౌన్ కారణంగా ముందుకు సాగలేకపోయాం. చుట్టూ ఎంతోమంది పడుతున్న ఇబ్బందుల్ని చూసి, మా వంతుగా ఇలా సాయమందిస్తున్నా’మంటోందీ హైదరాబాదీ క్రికెటర్. అర్హులైన పిల్లలకు స్పోర్ట్స్ కిట్‌లను అందించడం, క్రికెట్ మాత్రమే కాకుండా వారు కోరుకున్న ఇతర ఆటల్లోనూ శిక్షణనిప్పించాలన్నది తన ధ్యేయమని చెప్పుకొచ్చింది.
ఆటతో సాయం
వీరిద్దరూ కొవిడ్ బాధితుల సహాయార్థం ఆన్‌లైన్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లనూ ఆడుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్‌తో కలిసి వీటిలో పాల్గొంటున్నారు. ‘చెక్‌మేట్ కొవిడ్’ పేరిట నిర్వహిస్తున్న వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని వైద్య, ఆర్థిక సాయం అవసరమైన బాధితులకు అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వీరితో ఆడొచ్చు. కాకపోతే ఆడటానికీ, ఆపై కొనసాగించడానికీ కొంత మొత్తాన్ని చెల్లించాలి. 15వేల డాలర్ల లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టగా 50,000 డాలర్లు అంటే 37 లక్షల రూపాయలకు పైగా సేకరించగలిగారు. హంపి గత ఏడాదీ ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో ఆనంద్‌తో కలిసి పాల్గొంది. అప్పుడు నాలుగున్నర లక్షల రూపాయలను సేకరించారు.
హారిక.. ఆసుపత్రుల్లో పడకల కోసం ప్రయత్నించే వారికోసమూ పనిచేస్తోంది. కొవిడ్ బారినపడిన వారికోసం ‘ఫైండ్ ఎ బెడ్’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ‘కాజ్ అంబాసిడర్’గా వ్యవహరిస్తోంది. దీనిని కొంతమంది యువత ప్రారంభించారు. ఎవరికైనా బెడ్ అవసరమైతే ఆమె తన నెట్‌వర్క్‌తో సంప్రదించి దొరికేలా చేస్తుందట.
ఇదీ చదవండి: ముందే వచ్చిన నైరుతి రుతుపవనాలు.. గత మూడేళ్లలో ఇదే తొలిసారి