IND Vs ENG ODI: లార్డ్స్ వేదికగా కీలక సమరానికి టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్లు సిద్ధమయ్యాయి. తొలివన్డే విజయం ఇచ్చిన ఊపులో ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకునేందుకు టీమ్ఇండియా తహతహలాడుతోంది. తొలివన్డేలో జస్ప్రీత్ బుమ్రా, షమీ సహా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారతజట్టు ఇంగ్లాండ్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్, శిఖర్ ధావన్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో పది వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. రెండో వన్డేలోనూ ఇదే దూకుడైన ఆటతీరు ప్రదర్శించాలని టీమ్ఇండియా భావిస్తోంది.
గజ్జల్లో గాయం కారణంగా తొలివన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌కైనా అందుబాటులో ఉంటాడా అనేది అనుమానంగా మారింది. కోహ్లీ దూరమయ్యే పరిస్థితుల్లో తొలివన్డేలో బరిలోకి దిగిన జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్‌ధావన్ ఫామ్ కొనసాగించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. అయితే శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్ బలహీనత జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. బౌలర్లు మొదటి వన్డే తరహా ప్రదర్శన పునరావృతం చేయాలని జట్టు కోరుకుంటోంది.
మరోవైపు టీ20 సిరీస్ ఓటమి పాలై.. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ రెండో వన్డేలో గెలిచి.. సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమితుడైన బట్లర్‌కు సారథ్యం వహించిన తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఇంగ్లీష్ టీమ్ ఉంది. బట్లర్, రూట్, బెన్ స్టోక్స్, బెయిర్‌స్టో, లివింగ్ స్టోన్‌లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ దుర్బేధ్యంగా ఉంది. అయితే ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచాలని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. మ్యాచ్ గురువారం సాయంత్రం5.30 గంటలకు ప్రారంభం కానుండగా లార్డ్స్ పిచ్ సైతం ఓవల్ తరహాలోనే ఉంటుందని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: ICC Rankings: వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్ వన్.. టీ20లో 5వ స్థానానికి సూర్య