టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి భారత జట్టులో చాలా మార్పులు వచ్చాయి. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోవడం, హెడ్ కోచ్ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. 2023 వన్డే ప్రపంచకప్ వరకు కోహ్లీనే టీమ్‌ఇండియా సారథిగా కొనసాగుతాడని చాలా మంది భావించారు. అయితే సెలెక్టర్లు, బీసీసీఐ వర్గాలు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీని కోరినా వినలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమించే సంప్రదాయం ఇంతకు ముందెన్నడూ లేదు. దీంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో ఓపెనర్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమించింది.
Sourav Ganguly on Rohit Sharma:
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం వల్ల అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఉన్న రికార్డు ఆధారంగానే అతడికి బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నాడు.
"ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రోహిత్ శర్మకి గొప్ప రికార్డు ఉంది. ముంబయి ఇండియన్స్ జట్టును ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అంతేకాకుండా, టీమ్‌ఇండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలోనూ చాలా విజయాలు సాధించాడు. రోహిత్ సారథ్యంలోనే భారత జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఈ రికార్డును పరిగణనలోకి తీసుకనే సెలెక్టర్లు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. టీమ్‌ఇండియా శాశ్వత కెప్టెన్‌గా కూడా అతడు ఇదే విజయ పరంపరను కొనసాగిస్తాడనుకుంటున్నాను"
- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
టీ20 ప్రపంచకప్ నుంచి టీమ్ఇండియా అర్ధాంతరంగా నిష్క్రమించిన తర్వాత .. పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకొంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి: రోహిత్ శర్మకు గాయం.. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు దూరం