శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. సొంత గడ్డపై మ్యాచ్‌లో లంక కెప్టెన్ కరుణరత్నె (234 బ్యాటింగ్; 419 బంతుల్లో 25*4) అజేయ ద్విశతకంతో చెలరేగాడు. అతనికి తోడు ధనంజయ డిసిల్వా (154 బ్యాటింగ్; 278 బంతుల్లో 20*4 )శతకంతో సత్తాచాటాడు. దీంతో నాలుగో రోజు, శనివారం లంక తొలి ఇన్నింగ్స్‌లో 512/3తో ఆట ముగించింది. వెలుతురు లేమి కారణంగా ఆటను ముందుగానే ఆపేశారు.
ఓవర్‌నైట్ స్కోరు 229/3తో ఇన్నింగ్స్ కొనసాగించిన జట్టును.. కరుణరత్నె (ఓవర్‌నైట్ స్కోరు 85), ధనంజయ (ఓవర్‌నైట్ స్కోరు 26) ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించారు. రోజంతా వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లను విసిగించారు. నాలుగో వికెట్‌కు ఈ జోడీ ఇప్పటికే 322 పరుగులు జతచేసింది.
బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు లంక ఇంకా 29 పరుగులు వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌ను బంగ్లా 541/7 వద్ద డిక్లేర్ చేసింది. మరొక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా మగిసే అవకాశాలే ఎక్కువ.
ఇదీ చూడండి: 'ఆత్మవిశ్వాసం నింపడంలో శాస్త్రిని మించినా వారు లేరు'