అబుదాబిలో నిర్వహించనున్న మిగిలిన పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) మ్యాచ్‌లకు ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది అందుబాటులో ఉండట్లేదు. నడుము భాగంలో తీవ్ర నొప్పి ఉండటం వల్లే తాను తప్పుకొంటున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
"దురదృష్టవశాత్తు, కరాచీలో శిక్షణ చేస్తున్నప్పుడు నడుములో బాగా నొప్పిగా అనిపించింది. వైద్యులను సంప్రదించగా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. టోర్నీ నుంచి వైదొలగడం నాకెంతో బాధగా ఉంది. నా జట్టుకు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది. ట్రోఫీని అందుకుంటారని ఆశిస్తున్నా."
-అఫ్రిది, పాక్ మాజీ క్రికెటర్.
పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు అఫ్రిది. మార్చిలో ఈ సీజన్ నిర్వహించగా కరోనా వల్ల మధ్యలో నిరవధిక వాయిదా వేశారు. ఇటీవలే మిగతా మ్యాచ్‌లను అబుదాబి వేదికగా వచ్చే నెలలో జరపాలని నిర్ణయించారు.
నసీమ్ షా కూడా ఔట్
మిగిలిన పీఎస్ఎల్ మ్యాచ్‌లకు క్వెట్టా గ్లాడియేటర్స్ పేసర్ నసీమ్ షా(పాక్) కూడా అందుబాటులో ఉండట్లేదు. అతడు పాకిస్థాన్ నుంచి అబుదాబి బయలుదేరే సమయంలో కరోనా ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించాడు. అందుకే అతడిని పక్కనపెట్టారు.
ఇదీ చూడండి ఆ రికార్డు సాధించిన ఒకే ఒక జట్టు టీమ్ఇండియా!