"మీ ఐపీఎల్‌లో డబ్బులు తప్ప మరేం ఉండవు.. అదే మా పీఎస్‌ఎల్‌లో అయితే సూపర్ క్రికెట్ ఉంటుంది".. ఈ డైలాగులు గుర్తున్నాయా! ఆ మధ్య కాలంలో పాకిస్థాన్ క్రికెటర్లు, ఫ్యాన్స్ తెగ చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ గురించి చెప్పుకోవడానికి వాళ్ల దగ్గరే మంచి కంటెంట్ లేకుండా పోయింది. లీగ్‌లో భాగంగా మ్యాచులు నిర్వహించడంలో స్థానిక ప్రభుత్వాలతో గొడవలు, డబ్బులు లేక ప్రభుత్వాల అవస్థలు మాత్రమే ఈ లీగ్ హైలైట్‌గా నిలిచాయి. అయితే ఈ సీజన్లో మరోసారి భద్రతా లోపం బయటపడింది.
మ్యాచ్ భద్రత కోసం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎనిమిది సెక్యూరిటీ కెమెరాలు చోరీకి గురయ్యాయి. సెక్యూరిటీ కెమెరాలతో పాటు జనరేటర్ బ్యాటరీలు, ఫైబర్ కేబుల్స్ కూడా ఎత్తుకుపోయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. చోరీకి గురైన వస్తువులన్నీ దాదాపు కోటి రూపాయలు విలువ చేస్తాయని పాకిస్తాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. గుల్బర్గ్ పోలీస్ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, గడ్డాఫీ స్టేడియంలోనే క్వాలిఫయిర్, ఎలిమినేటర్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో మరోసారి భద్రతా వైఫల్యం తలెత్తడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ఖర్మరా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.