టీమ్ఇండియా ఓపెనర్లలో ఎవరు బెస్ట్ అనే విషయాన్ని వెల్లడించే క్రమంలో పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లాయిన్ ముస్తాక్(Saklain Mustak) వీరూపై ప్రశంసల వర్షం కురిపించాడు. సెహ్వాగ్(virender sehwag) ఆట తీరుతోనే టీమ్‌ఇండియా బ్యాటింగ్ పవర్ హౌస్‌గా తయారైందని ముస్తాక్ అభిప్రాయపడ్డాడు.
"వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన శైలి, అతడు ప్రపంచ క్రికెట్‌పై చూపిన ప్రభావం వల్ల ఎంతోమంది భారత ఆటగాళ్లు ప్రయోజనం పొందారని గుర్తుంచుకోండి. అతడి ఆటతీరు భారత క్రికెట్‌తోపాటు క్రికెటర్ల మనస్తత్వాన్ని మార్చేసింది. అతడు వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. దాన్ని సాధిస్తామనే నమ్మకం రోహిత్ శర్మలాగా ఆటగాళ్లలో ఉండాలి. వీరూ బ్యాటింగ్‌ని చూసి రోహిత్ చాలా నేర్చుకున్నాడు."
- సక్లాయిన్ ముస్తాక్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
"సెహ్వాగ్ కంటే రోహిత్ గణాంకాలు మెరుగ్గా ఉండొచ్చు. కానీ, వీరూ ఆట వెనుక ఒక ముఖ్య పాత్ర ఉంది. ఆటతీరుతో అతని తర్వాత వచ్చిన ఆటగాళ్ల ఆలోచన ధోరణిని మార్చాడు. వీరూ కన్నా ముందు సర్ వివ్‌రిచర్డ్స్, జహీర్ అబ్బాస్ లాంటి ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే వన్డే క్రికెట్‌లో దూకుడుగా ఆడి ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. వాళ్ల తర్వాత సెహ్వాగ్ కూడా ప్రపంచ క్రికెట్‌పై అధిపత్యం చలాయించాడు" అని సక్లాయిన్ అన్నాడు.
అప్పట్లో వీరేంద్ర సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడంటే బౌలర్లకు వణుకు పుడుతుండేది. ఎందుకంటే, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా.. మొదటి బంతా, రెండో బంతా అనే విషయాలను పక్కన పెడుతూ దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి బాదడమే పనిగా పెట్టుకునేవాడు వీరూ. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్ వీరూనే. ఇక, ప్రస్తుత ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) కూడా తక్కువేం కాదు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బౌలర్లను ఊచకోత కోస్తాడు. అందుకే అభిమానులు ఇతణ్ని హిట్‌మ్యాన్ అని పిలుస్తారు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్ రోహితే కావడం విశేషం.
ఇదీ చూడండి: Siraj: రవిశాస్త్రి మాటలతో బౌలర్ సిరాజ్ అలా!