Rohithsharma Ind vs Wi: ఐపీఎల్ మెగావేలంలో పలువురు ఆటగాళ్లు రికార్డు ధరకు అమ్ముడుపోయారు. మరికొందరికి నిరాశ ఎదురైంది. అయితే ఈ భావోద్వేగాల ప్రభావం జాతీయ జట్టు ప్రయోజనాలపై పడకూడదని కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లకు సూచించాడు.
ఐపీఎల్లో ఏ జట్టుకు ఆడుతున్నారు? ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నారు? వంటి అంశాలను పరిగణలోకి తీసుకునేది ఉండదని, టీమ్ఇండియా తరఫున ఆడేటప్పుడు జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు రోహిత్.
"మెగావేలంలో ఎదురైన అనుభవాల వల్ల ఆటగాళ్లు భావోద్వేగానికి గురౌతారు. అయితే వీటిని పక్కనపెట్టి రాబోయే రెండు వారాల పాటు జాతీయ జట్టుపై దృష్టి పెట్టడం ముఖ్యమని వారికి చెప్పాను. అయిపోయిందేదో అయిపోయింది. వారు ఏ టీమ్‌కు ఆడుతున్నారనేది భవిష్యత్. ప్రస్తుతం, రాబోయే రెండు వారాల పాటు టీమ్ఇండియా కోసం శ్రమించాలి. దానిపైనే దృష్టి పెట్టాలి. అయితే వాళ్లంతా ప్రొఫెషనల్స్. కానీ ఓ సారి ఈ విషయాన్ని గుర్తుచేశాం."
-రోహిత్‌శర్మ, కెప్టెన్.
యువ ఆటగాళ్లకు భరోసా ఇవ్వాలి
ప్రయోగాల పేరిట యువ ఆటగాళ్లను అభద్రతాభావానికి గురి చేయకూడదని రోహిత్ శర్మ అన్నాడు. జట్టులోని కుర్రాళ్లు నిలకడగా రాణించేందుకు తగిన భరోసా ఇవ్వాలని పేర్కొన్నాడు.
"గత టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఘోర పరాభవం దృష్ట్యా.. పేస్, స్పిన్, ఆల్ రౌండర్ విభాగాలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియాలో జరుగనున్న తర్వాతి టీ20 ప్రపంచకప్‌కు ఇంకా ఎనిమిది నెలల సమయమే ఉంది. ఆలోపు, యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి.. ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. రానున్న ప్రపంచకప్ వరకు నిలకడగా రాణించగల ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహిస్తాం. ఇటీవల చాలా మంది ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతూ.. జట్టుకు దూరమవుతున్నారు. ప్రపంచకప్ వరకు ఎవరు ఫిట్‌గా ఉంటారో, ఎవరు దూరమవుతారో చెప్పడం కష్టంగా మారింది. హార్దిక్ పాండ్య జట్టుకు దూరమైనప్పటి నుంచి పలువురు యువ ఆటగాళ్లతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయోగాలు చేశాం. వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌లకు అవకాశాలు ఇచ్చినా.. హార్దిక్ లాగా బలమైన ముద్ర వేయలేకపోయారు. హార్దిక్ కోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. పూర్తిస్థాయి బ్యాటర్‌గా అతడిని జట్టులోకి తీసుకునే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు"
-రోహిత్.
ఆ ఇద్దరూ ముఖ్యమే..
"మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ (కుల్-చా) ఇద్దరూ అందుబాటులోకి వచ్చారు. వాళ్లిద్దరికీ మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. అవసరాన్ని బట్టి పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల సమర్థులు. చాహల్ ఇప్పటికే సత్తా చాటాడు. చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న కుల్దీప్ యాదవ్ మునుపటి లయను అందుకోవాల్సి ఉంది" అని రోహిత్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో యుజ్వేంద్ర చాహల్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆఖరి వన్డేలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.
కాగా, ఫిబ్రవరి 16 నుంచి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా బుధవారం జరగనుంది.
ఇదీ చూడండి: నా పాన్‌కార్డ్ పోయింది ఎవరైనా సాయం చేయండి: కెవిన్ పీటర్సన్