Rohithsharma Siraj: టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్.. ఆటగాళ్లను అర్థం చేసుకునే సారథి అని అన్నాడు. అతడు 'ప్లాన్ బి'తో ముందుకు వచ్చి బౌలర్లను ప్రోత్సహిస్తున్నాడని, మమ్మల్ని అర్థం చేసుకునే కెప్టెన్ కింద పనిచేయడం గొప్ప అనుభూతిని ఇస్తోందని వివరించాడు. "ఆటగాళ్ల మానసిక స్థితిని రోహిత్ శర్మ అర్థం చేసుకుంటాడు. మైదానంలో మాకు కష్టమైన సమయం ఎదురైనప్పుడల్లా అతను ప్లాన్ బితో ముందుకు వస్తాడు. ఆటలో మెరుగైన ప్రదర్శన చేసేలా బౌలర్లలో స్ఫూర్తి నింపుతాడు. మమ్మల్ని ఇంతలా అర్థం చేసుకునే కెప్టెన్ కింద పనిచేయడం గొప్ప అనుభూతినిస్తోంది" అని సిరాజ్ అన్నాడు.
గతేడాది ఇంగ్లాండ్, భారత్ మధ్య జరగాల్సిన ఐదో (చివరి) టెస్టు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ టెస్టుని రీ షెడ్యూల్ చేసి బర్మింగ్‌హమ్‌లో జులై 1-5 మధ్య నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో భారత్ 2-1 అధిక్యంలో ఉంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. "ప్రస్తుతం మేం ఇంగ్లాండ్‌తో టెస్ట్ ఆడటానికి కొంత సమయం ఉంది. మొన్నటివరకు టీ20లు ఆడి టెస్ట్ మ్యాచ్‌కి మారడం పెద్ద మార్పు. కాబట్టి, మా ఇంటి సమీపంలోని మైదానంలో శిక్షణ పొందుతూ ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తా. టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడానికి, నిలకడగా రాణించడంపై దృష్టిపెట్టాలి. ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం అదే" అని సిరాజ్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: పీరియడ్స్‌ను మహిళా అథ్లెట్స్ ఎలా మేనేజ్ చేస్తారో తెలుసా?