rohit sharma news: భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 15 వసంతాలు పూర్తైన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగ లేఖను పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. జీవితమంతా ఈ జర్నీని గుర్తుంచుకుంటాన్నారు. జూన్ 23, 2007న ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ అరంగేట్రం చేశారు. '15 ఇయర్స్ ఇన్ మై ఫేవరెట్ జెర్సీ' అంటూ సోషల్‌మీడియా వేదికగా లేఖను విడుదల చేశారు.
"ఈ రోజుతో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తిచేసుకున్నాను. ఈ ప్రయాణం అద్భుతమైనది. జీవితాంతం ఈ జర్నీ ఓ జ్ఞాపకంలా మిగిలిపోతుంది. నా ప్రయాణంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాకు సహకారం అందించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వల్లే ఓ ఆటగాడిగా ఈ స్థానంలో ఉన్నాను. క్రికెట్ ప్రేమికులు, అభిమానులు, విమర్శకుల ప్రేమ వల్లే ఎన్నో అవరోధాలు దాటాను"
- రోహిత్ శర్మ, భారత కెప్టెన్
35 ఏళ్ల రోహిత్‌శర్మ.. ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో రికార్డులను సాధించారు. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేసి.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కారు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించారు. 2019 ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 228 వన్డే మ్యాచులాడిన రోహిత్‌శర్మ.. 9,823 పరుగులు చేశారు. 124 టీ20ల్లో 3,308, 44 టెస్టుల్లో 3,706 పరుగులు సాధించారు. గతేడాది విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం వల్ల అన్ని ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలు అందుకున్నారు రోహిత్ శర్మ. తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వగా.. ఇంగ్లాండ్‌తో జరగునున్న ఐదో టెస్టులో బరిలోకి దిగనున్నారు.
ఇదీ చదవండి: భారత్-ఇంగ్లాండ్ సిరీస్.. అప్పుడేమైందంటే?