భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నాడు. మ్యాచ్లో వికెట్ రాకపోయినా.. తప్పు చేసే పరిస్థితికి వారిని తీసుకురావాలని చెప్పాడు.
కాగా, విరాట్ కోహ్లీ నుంచి పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ.. టీమ్ఇండియా కెప్టెన్ అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. ఇప్పటికే అతడి కెప్టెన్సీలో టీ20 క్రికెట్లో అగ్ర స్థానంలో టీమ్ఇండియా కొనసాగుతోంది. ఇక, టెస్టుల్లోనూ విజయాలు సాధిస్తోంది. తాజాగా రోహిత్ సారథ్యంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించి బోణీ కొట్టింది. ఈ నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు తాను జట్టులో ఆటగాడిగా ఉన్నానని.. ఆ సమయంలో విరాట్ నుంచి కొన్ని మెలకువలు నేర్చుకున్నానని రోహిత్ శర్మ తెలిపాడు.
"నేను ప్లేయర్గా ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సమయంలో నేను ఒక విషయం నేర్చుకున్నాను. మనకు వికెట్ రాకపోయినా ఫర్వాలేదు. కానీ, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు తప్పు చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, మన బౌలర్ల నుంచి చూసి నేను నేర్చుకున్నా. ప్రస్తుతం నేనదే అమలు చేస్తున్నా. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తేవాలి. ప్రతి బంతికి వికెట్‌ను ఆశించవద్దు. బంతిని సరైన చోట్లలో వేయాలి. అప్పుడు పిచ్ కూడా మనకి సహకరిస్తుంది"
--రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఎన్నో విజయాలు సాధించి తిరుగులేని జట్టుగా అవతరించింది. దూకుడైన ఆటతీరును కూడా అలవాటు చేసుకుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోనే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఇప్పుడు మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమ్‌ఇండియాకు మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు బాగానే ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న 4 టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ మరో రెండు మ్యాచుల్లో విజయాలు సాధిస్తే 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది.