కఠిన పరిస్థితుల్లోనూ ఎంతో నిబ్బరంగా పాక్ బౌలింగ్‌ను చిత్తు చేసి భారత్ విజయం సాధించడంలో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు. చివరి ఓవర్‌లో ఆత్మవిశ్వాసంతో కొట్టిన సిక్సర్.. టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీని గుర్తుకు తెచ్చిందని సీనియర్ ఆటగాడు రాబిన్ ఉతప్ప అన్నాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన హార్దిక్‌కు ధోనీ అండగా నిలిచాడని గుర్తు చేశాడు. వారిద్దరూ చాలా మంచి స్నేహితులని, పాండ్య క్రికెటర్‌గా ఎదగడంలో ధోనీ ముఖ్య భూమిక పోషించినట్లు పేర్కొన్నాడు. అందుకేనేమో ధోనీ ఆటతీరు హార్దిక్‌లో కనిపిస్తోందంటూ ఉతప్ప తెలిపాడు.
క్రీడా ఛానల్‌తో ఉతప్ప మాట్లాడుతూ.. ''ఎంఎస్ ధోనీని అనుకరించేందుకు పాండ్య ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. ధోనీ నుంచి చాలా విషయాలను నేర్చుకోవచ్చు. అంతేకాకుండా వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. కాబట్టే పాండ్యలో ధోనీ ఆటతీరును కనిపిస్తుంది. అంతేకాకుండా స్టైల్ కూడా అలానే ఉంది. ఇదే ఫామ్‌ను పాండ్య కొనసాగిస్తే మాత్రం తప్పకుండా నాయకత్వ పాత్రలో చూస్తాం'' అని ఉతప్ప వివరించాడు. పాక్‌పై బౌలింగ్‌లో కీలకమైన మూడు వికెట్లు తీసిన హార్దిక్.. బ్యాటింగ్‌లో 33 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఇవీ చదవండి: భారత్, పాక్ మ్యాచ్ నాకు నచ్చలేదు, షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్‌తో మ్యాచ్, రోహిత్ శర్మ, భువనేశ్వర్ సూపర్ రికార్డ్స్