Pant Recalls Aus Test Series: 2020-21 ఆస్ట్రేలియా పర్యటన తన జీవితానికి మేలి మలుపని టీమ్‌ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ అన్నాడు. ఆ పర్యటనలో తొలి టెస్టులో ఘోర పరాభవం పాలై, తర్వాత కీలక ఆటగాళ్ల గైర్హాజరీతో టీమ్‌ఇండియాలో నిస్తేజం అలుముకున్న స్థితిలో సాధించిన అద్భుత విజయాలు, వాటిలో రిషబ్ పంత్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో అతడి అద్భుత ఇన్నింగ్స్‌లు సిరీస్ విజయంలో కీలకమయ్యాయి. అయితే ఈ పర్యటనకు ముందు పంత్ ఫామ్ ఏమంత గొప్పగా లేదు. 2019 ప్రపంచకప్ జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు. కెరీర్లో ఆ పేలవ దశ గురించి మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి ఒక యూట్యూబ్‌లో మాట్లాడాడు పంత్.
''ప్రపంచకప్ జట్టులో నాకు చోటు దక్కని సమయంలో నేను ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులతోనూ మాట్లాడలేదు. నాతో నేను ఒంటరిగా ఉండిపోయా. ఆట కోసం నూటికి 200 శాతం ఇవ్వాలని అనుకున్నా. అప్పటికి నా వయసు 22-23 ఏళ్లుంటాయంతే. ఉన్నట్లుండి రెండు ఫార్మాట్లలో చోటు పోయేసరికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మానసికంగా నా జీవితంలో అది అత్యంత పేలవ దశ. అందరూ ఇక నీ వల్ల కాదు అంటుండడంతో ఒంటరిగా ఉండి నేనేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించా. సిడ్నీలో 97 పరుగులు చేసిన మ్యాచ్‌లో పెయిన్ కిల్లర్లు తీసుకుని ఆడా. ఆ టెస్టులో ఓటమి బాటలో ఉన్న మేం గెలిచే స్థితికి వచ్చాం. అప్పుడు నేను ఔటయ్యా. సెంచరీ కోల్పోవడం కంటే మ్యాచ్ గెలిపించలేకపోవడం నన్ను బాధించింది. తర్వాత అశ్విన్, విహారి కలిసి మ్యాచ్‌ను కాపాడారు. తర్వాత గబ్బాలో అద్భుతం జరిగింది. నా జీవితంలో కచ్చితంగా ఆ పర్యటన గొప్ప మలుపు.'' అని పంత్ అన్నాడు.
ఇవీ చూడండి: 'అప్పుడు చాలా కష్టంగా అనిపించింది.. ఆ ఇద్దరితోనే మాట్లాడేవాడ్ని'