Ashwin praises Shardul: టీమ్‌ఇండియాలో ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న శార్దూల్ ఠాకూర్‌పై ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్ల బ్యాటింగ్‌లోని లోపాలను శార్దూల్ తన ఆటతో ఎత్తిచూపాడని అశ్విన్ వివరించాడు. అలాగే లోయర్‌ఆర్డర్ బ్యాటింగ్‌లో నాణ్యతను తీసుకొచ్చాడని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.
2020-21 బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సందర్భంగా క్లిష్టమైన పరిస్థితుల్లో శార్దూల్ అర్దశతకాలు సాధించి అందరి మన్ననలు పొందాడు. ఈ క్రమంలో గత సంఘటనలను అశ్విన్ గుర్తు చేసుకుంటూ.. "మన బ్యాటర్లు విదేశాల్లో ఎక్కువగా షార్ట్ లెంగ్త్ బంతులను ఆడేందుకు యత్నించి ఔటయ్యేవారు. అయితే ఆసీస్ గడ్డ మీద ఠాకూర్ హుక్-పుల్ షాట్లతో పరుగులు రాబట్టాడు. మా అందరిలోని లోపాలను తన బ్యాటింగ్‌తో ఎత్తి చూపాడు. అలానే ఇంగ్లాండ్‌లోనూ రాణించాడు. ఇదే ఫామ్‌ను దక్షిణాఫ్రికాలోనూ కొనసాగించాలని ఆశిస్తున్నా" అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం అశ్విన్, శార్దూల్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. సెంచూరియన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా రెండో రోజు ఆట రద్దైంది. 272/3 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా 327 పరుగులకు ఆలౌటైంది. పిచ్ తేమగా ఉండటం వల్ల దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించారు. భారత్ కేవలం 55 పరుగులకే మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది.