Dravid on Harbhajan retirement: టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శుక్రవారం ఆటకు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా భజ్జీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో భజ్జీ తనకెంతో సాయం చేశాడని చెప్పాడు కోహ్లీ. అలాగే ఎన్ని సవాళ్లు ఎదురైనా కసితో ఆడేవాడని వెల్లడించాడు ద్రవిడ్.
"టీమ్‌ఇండియా తరఫున అద్భుత కెరీర్ సాగించిన హర్భజన్‌కు అభినందనలు. అతడికి 18 ఏళ్లు ఉండగా మొహాలీలో తొలిసారి చూడటం నాకింకా గుర్తుంది. చూడగానే మంచి టాలెంట్ ఉన్న ఆటగాడిగా కనిపించాడు. ఇప్పటివరకు అతడు సాధించింది చూస్తే నిజంగా గర్వంగా ఉంటుంది. కెరీర్‌ను చాలా గొప్పగా తీర్చిదిద్దుకున్నాడు. అలాగే ఎన్నో ఎత్తుపల్లాలు కూడా చూశాడు. ఎన్ని సవాళ్లు ఎదురైనా చిరునవ్వుతో తిరిగొచ్చి కసితో ఆడేవాడు. గొప్ప ఆటగాడే కాకుండా మంచి టీమ్ ప్లేయర్ కూడా. అతడో గొప్ప పోరాట యోధుడు. టీమ్‌ఇండియా తరఫున రాణించిన అతిగొప్ప ఆటగాళ్లలో ఒకడు. అనిల్ కుంబ్లే లాంటి ఆటగాడికి సహచరుడిగా ఉంటూ టెస్టుల్లో 400 వికెట్లు తీయడం ఆషామాషీ కాదు. అతడితో కలిసి ఆడటం సంతోషకరమే కాకుండా గర్వంగానూ ఉంది."
-ద్రవిడ్, టీమ్ఇండియా కోచ్
Kohli on Harbhajan retirement: ఇక విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. "భజ్జీ పా.. భారత క్రికెట్‌లో నీ అద్భుతమైన ప్రయాణానికి అభినందనలు. 711 అంతర్జాతీయ వికెట్లు సాధించడం చాలా గొప్ప విషయం. ఈ ఘనత సాధించినందుకు నువ్వు చాలా గర్వపడాలి. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. ఇన్నేళ్లు రాణించడం.. అన్ని వికెట్లు పడగొట్టడం అనేది మరో స్థాయి ప్రదర్శన. ఇకపై నీ జీవితంలో ఏది చేసినా ఆల్ ది బెస్ట్. సుఖ శాంతులతో.. కుటుంబంతో మరింత ఆనందంగా ఉంటావని ఆశిస్తున్నా. అలాగే మనమిద్దరం ఆడిన రోజుల్లో జట్టులో గడిపిన క్షణాలన్నింటినీ ఎప్పటికీ గుర్తుంచుకుంటా. నేను జట్టులోకి వచ్చిన కొత్తలోనూ వెన్నుతట్టి ప్రోత్సహించావు. ఆఫ్‌ఫీల్డ్‌లోనూ మనమెంతో మంచి స్నేహితులుగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్" అంటూ భజ్జీతో కలిసిన ఆడిన క్షణాల్ని గుర్తుచేసుకున్నాడు.