ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో పలు మార్పులే చేసింది బీసీసీఐ. పలువురు ఆటగాళ్లు గాయల బారిన పడిన నేపథ్యంలో కొత్త జట్టును వెల్లడించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ గాయాల కారణంగా ఇంగ్లాండ్ పర్యటన నుంచి వైదొలిగారు. వీరి స్థానంలో ఓపెనర్ పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌ల పేర్లను చేర్చింది.
ఆల్‌రౌండర్ వాషింగ్టన్ బౌలింగ్ చేతికి ఇంజెక్షన్ తీసుకున్నాడు. అయితే అతడు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్ సందర్భంగా బౌలర్ అవేశ్ ఖాన్ బొటనవేలికి గాయమైంది. ఎక్స్ రేలో వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అతడు ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు. మరో బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ కాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ఇంగ్లాండ్ పర్యటన నుంచి తప్పుకొన్నాడు.
జట్టుతో చేరిన పంత్..
కొవిడ్ నుంచి కోలుకున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ తిరిగి జట్టుతో చేరాడు. రెండు సార్లు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకున్న పంత్.. వాటిల్లో నెగెటివ్ వచ్చిన అనంతరమే భారత బృందంతో కలిశాడు. పంత్‌తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, వృద్ధిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్ కూడా కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఐసోలేషన్ పూర్తి చేసుకున్న వీరంతా తిరిగి జట్టుతో చేరారు.
భారత బృందం..
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానె(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకుర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్.
స్టాండ్ బై ప్లేయర్లు.. ప్రసిధ్ కృష్ణ, అర్జాన్ నగ్వాస్వల్లా.
ఇదీ చదవండి: భారత్ క్రికెటర్ నోట లంక జాతీయ గీతం