అంచనాలను తలకిందుల చేస్తూ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది పాకిస్థాన్. గురువారం మరి కాసేపట్లో జరిగే రెండో సెమీస్‌లో భారత్ గెలిస్తే.. చిరకాల ప్రత్యర్థుల రసవత్తర టైటిల్ మ్యాచ్‌ను చూడొచ్చు. ఒక వేళ భారత్ ఫైనల్‌కు వస్తే.. దాయాదుల పోరులో ఆటగాళ్లపై ఒత్తిడి ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ విలేకరి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను ప్రశ్నించాడు. "ఫైనల్‌లో మీకు ప్రత్యర్థిగా నిలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువని మీకూ తెలుసు. అలాంటి కీలక మ్యాచ్‌ల్లో సాధారణంగా ఆటగాళ్లు ఒత్తిడిలో ఉంటారు. మరి ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీ వ్యూహాలేంటి?" అని బాబర్‌ను విలేకరి అడిగారు.
దీనిపై బాబర్ మాట్లాడుతూ.. "ఫైనల్‌లో మా ప్రత్యర్థి ఎవరనేది ఇప్పుడే చెప్పలేం. అయితే అది ఎవరైనా సరే.. మేం 100శాతం ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కష్టపడతాం. ఎప్పుడైనా సవాళ్లను ఎదుర్కొనేందుకే ప్రయత్నిస్తాం. ఈ టోర్నమెంట్‌లో ఎన్నో క్లిష్టమైన దశలను దాటి ఫైనల్‌కు చేరుకున్నాం. అలాంటప్పుడు.. ఫైనల్‌లో భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉంది. గత 3-4 మ్యాచ్‌ల్లో మేం అలాంటి ఆటే ఆడాం. టైటిల్ పోరులోనూ అదే కొనసాగిస్తామని ఆశిస్తున్నాం" అని బదులిచ్చాడు.
2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్లే ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచి పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది.
ఇదీ చూడండి: T20 world cup Semi: మార్పులతో బరిలోకి భారత్.. కానీ పోరుకు వర్షం ముప్పు!