ఉప్పల్ స్టేడియంలో భారత్-కివీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదిన గిల్‌తో పాటు వినిపించిన మరో పేరు బ్రాస్ వెల్ (140; 78 బంతుల్లో 12×4, 10×6). ఎందుకంటే అప్పటివరకు మనోళ్లకి పరిచయం లేని అతడు తన మెరుపు శతకంతో భయపెట్టి తన పేరును మార్మోగేలా చేశాడు. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇక ఓటమి తప్పదు అన్న దశలో.. తమ జట్టును తన ప్రదర్శనతో దాదాపు గెలిపించినంత పనే చేశాడు. ఇక ఇతడి ప్రదర్శనతో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ తప్పలేదు.
అయితే ఇతడి ప్రదర్శన చూశాక ఇప్పుడు అతడికి అభిమానులు అమాంతం పెరిగిపోయారు. క్రికెట్ లవర్స్ ఎవరిని కదిలించిన ప్రస్తుతం ఇతని పేరే వారి నోటి వినపడుతోంది. అలా తొలి వన్డేకు ముందు బ్రాస్ వెల్‌కు ఇన్‌స్టాలో 7,315 మంది ఫాలోవర్లు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య కాస్త అనూహ్యంగా ఊహించనంతగా పెరిగిపోయింది. దాదాపు 24 గంటల్లోపే బ్రాస్‌వెల్ ఫాలోవర్ల సంఖ్య 18.1 వేలు దాటింది. అంటే దాదాపు 11 వేల మంది కొత్తగా కివీస్ క్రికెటర్‌కు ఫాలోవర్లుగా చేరారన్నమాట.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. డిసెంబర్ 23న నిర్వహించిన ఐపీఎల్ వేలంలో బ్రాస్ వెల్ కోటి రూపాయల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. కానీ అతడిని కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ఏవీ ఆసక్తి చూపలేదు. ఇప్పుడీ ప్రదర్శనతో అతడిపై ఫ్రాంచైజీలకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. వచ్చే ఐపీఎల్ కోసం ఎంపికైన ఆటగాళ్లలో ఎవరైనా గాయపడితే.. లేదంటే టోర్నీకి దూరమైతే.. అతడి స్థానంలో ఇతడిని తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా తొలి వన్డేలో ఆశల్లేని స్థితిలో ఆకాశమే హద్దుగా చెలరేగి తమ జట్టుకు విజయానికి చేరువగా తీసుకుళ్లిన బ్రాస్ వెల్.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. అలా మహేంద్ర సింగ్ ధోనీ(139) పేరిట ఉన్న రికార్డును ఈ కివీస్ యోధుడు బ్రేక్ చేశాడు.
ఇదీ చదవండి: