ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు కోహ్లీసేన సన్నాహక పోరుకు సిద్ధమైంది. మంగళవారం నుంచే కౌంటీ సెలెక్ట్ ఎలెవన్ (INDIA vs COUNTY SELECT ELEVEN)తో మూడు రోజుల మ్యాచ్. కళ్లన్నీ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal)పైనే. టెస్టు తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న అతడు ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. గిల్ గైర్హాజరీలో తొలి టెస్టులో రోహిత్‌తో కలిసి మయాంక్ ఓపెనర్‌గా దిగే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో.. అతడి ఆటను జట్టు యాజమాన్యం నిశితంగా పరిశీలించనుంది.
రిషబ్ పంత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. కొవిడ్ పాజిటివ్‌గా తేలిన పంత్ లండన్‌లో సన్నిహితుల ఇంట్లో 10 రోజులు ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడని బీసీసీసీఐ వర్గాలు తెలిపాయి. వేగంగా కోలుకుంటున్న అతడు, డర్హమ్‌లో బయో బబుల్‌లో ఇంకా చేరలేదని చెప్పాయి.
"ఒకవేళ పంత్ జట్టుతో చేరినా.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్ అందుకోవడం కోసం అతడికి విశ్రాంతి ఇచ్చేవాళ్లు. అతడిలో లక్షణాలేమీ లేవు. కానీ నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టుకు ముందు అతడికి మంచి ట్రైనింగ్ అవసరం. ఏదేమైనా పంత్, సాహాలిద్దరూ తొలి టెస్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటారు" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఇక కౌంటీ ఎలెవన్ జట్టులో ఎక్కువ మంది కుర్రాళ్లే. ఒక్క జేమ్స్ బ్రాసే మాత్రమే ప్రస్తుతం ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు ఫస్ట్‌క్లాస్ హోదాను కూడా ఇచ్చారు.
ఇదీ చదవండి: కొవిడ్ నుంచి కోలుకున్న పంత్.. ఇక రంగంలోకి!