టీ20 ప్రపంచకప్ వేదిక భారత్ నుంచి యూఏఈకి మారడం దాదాపు ఖాయంగా కనబడుతోంది. దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా పొట్టి ప్రపంచకప్ భారత్‌లో నిర్వహించే అవకాశం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
"దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను భారత్ నుంచి యూఏఈకి తరలించే అవకాశం ఉంది. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. క్రికెటర్ల ఆరోగ్యం, భద్రతే మాకు అన్నింటికన్నా ప్రధానం. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం"
- జై షా, బీసీసీఐ కార్యదర్శి
సమయం లేదు.. సాధ్యమేనా?
అయితే రెండో దశ ఐపీఎల్ 14 కూడా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకు యూఏఈలోనే జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదే వేదికగా కేవలం రెండు రోజుల వ్యవధిలో అక్టోబరు 17 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్ నిర్వహణకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో భారత్ సహా అంతర్జాతీయ క్రికెటర్ల వసతి, రవాణా సౌకర్యాల కోసం ఏర్పాట్లు ఎలా చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. అదీకాక ఐసీసీకి కనీసం 2 వారాల ముందుగా మైదానాలను అప్పగించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను యూఏఈ(దుబాయి, షార్జా, అబుదాబి)లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయనున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: మూడు మెగా టోర్నీల కోసం బీసీసీఐ బిడ్లు!