Maxwell Baby : ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తండ్రయ్యాడు. మాక్స్ సతీమణి వినీ రామన్.. సోమవారం (సెప్టెంబర్ 11) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మ్యాక్స్.. శుక్రవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. '11.9.2023, లోగన్ మావెరిక్ మ్యాక్స్‌వెల్' అని పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చాడు. అంటే చిన్నారికి అప్పుడే 'లోగన్ మావెరిక్ మ్యాక్స్‌వెల్' అనే పేరును నామకరణం చేశారు. ఇక పలువురు సెలబ్రిటీలు, ఆటగాళ్లు మ్యాక్స్ దంపతులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Maxwell Wedding : భారతీయ మూలాలున్న ఫార్మాసిస్ట్ వినీ రామన్‌ను.. మ్యాక్స్‌వెల్ గతేడాది మార్చిలో పెళ్లాడాడు. మొదట క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న మ్యాక్స్.. వారం తర్వాత హిందు సంప్రదాయం ప్రకారం వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. ఇక మ్యాక్స్‌వెల్ భార్య వినీ రామన్.. తను తల్లి కానున్న విషయాన్ని ఈ ఏడాది మే నెలలోనే చెప్పింది. సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అప్పుడే వెల్లడించింది. ఆ తర్వాత జులైలో ఆమెకు తమిళ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా సీమంతం జరిగింది. ఈ వేడుకలో మ్యాక్స్.. తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఉంగరాన్ని వినీ రామన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Glenn Maxwell International Career : 34 ఏళ్ల మ్యాక్స్.. ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ ఆస్ట్రేలియాకు అనేక విజయాలు కట్టబెట్టాడు. ముఖ్యంగా టీ20ల్లో మ్యాక్స్ బ్యాటింగ్ స్టైలే వేరు. 98 టీ20 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్.. 150.98 స్ట్రైక్ రేట్‌తో 2159 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా మూడు ఫార్మాట్లలో కలిపి 233 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్.. 5988 పరుగులు చేశాడు. అటు బంతితోనూ రాణించి 107 వికెట్లు పడగొట్టాడు.
Maxwell Injury : ప్రస్తుతం మోకాలి గాయం కారణంగా.. మ్యాక్స్‌వెల్ సౌతాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోని అతడు.. భారత్ పర్యటనకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. ఇక మ్యాక్స్‌వెల్ నేరుగా అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ప్రపంచకప్ టోర్నీలోనే ఆడే ఛాన్స్ ఉంది. ఈ మెగా టోర్నమెంట్లో ఆసీస్.. అక్టోబర్ 8న భారత్‌ను ఢీకొట్టనుంది.
ఘనంగా వినీ సీమంతపు వేడుకలు.. భార్యకు గ్లెన్ సర్ప్రైజ్ గిఫ్ట్..
గుడ్‌న్యూస్ చెప్పిన మ్యాక్స్‌వెల్.. రెయిన్బో బేబీ అంటూ వినీ రామన్ ఎమోషనల్!