Kirti Azad about Virat Kohli: భారత క్రికెట్‌లో ఇప్పుడు కోహ్లీ-బీసీసీఐ మధ్య జరుగుతోన్న వివాదమే ప్రధానాంశంగా మారింది. ఈ విషయంపై తాజాగా మాజీ సెలెక్టర్, మాజీ ఆల్‌రౌండర్ కీర్తి ఆజాద్ స్పందించారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీని వన్డే సారథిగా తొలగించాలని సెలెక్టర్లు నిర్ణయించి ఉంటే ఆ విషయాన్ని మొదట బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ దృష్టికి తీసుకెళ్లాలని.. ఆయన ఆమోదం పొందాక.. కోహ్లీతో ప్రత్యేకంగా మాట్లాడేవాడని మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చారు. సహజంగా ఎప్పుడైనా ఒక జట్టును ఎంపిక చేసినప్పుడు, లేదా కెప్టెన్‌ను మార్చినప్పుడు సెలెక్టర్లు నిర్ణయం తీసుకొని దాన్ని అధ్యక్షుడికి చూపించిన తర్వాతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుందన్నారు. తాను సెలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లోనూ ఇలాగే చేశామని తెలిపారు. అయితే, ఇక్కడ కోహ్లీని వన్డే సారథిగా తొలగించడం కన్నా.. అతడికి ఆ విషయాన్ని తెలియజేసిన విధానమే మరింత బాధపెట్టి ఉండొచ్చని అన్నారు. చివరగా ఈ నిర్ణయం తీసుకున్న సెలెక్టర్లంతా చాలా గొప్ప వాళ్లని ప్రశంసిస్తూనే.. వాళ్లంతా కోహ్లీ ఆడిన ఆటలో సగం మ్యాచ్‌లు కూడా ఆడలేదని విమర్శించారు.