Root on Boxing day Test loss: యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్టులో ఘోర పరాజయం పాలైంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా అరంగేట్ర పేసర్ స్కాట్ బోలాండ్ ఆరు వికెట్లతో ఇంగ్లీష్ జట్టు నడ్డి విరిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఇంగ్లాండ్ సారథి రూట్.. ఇంత దారుణంగా ఓడిపోవడం బాధ కలిగించిందని తెలిపాడు.
"ఇలాంటి స్థితిలో ఓడిపోవడం బాధగా ఉంది. మిగతా మ్యాచ్‌ల్లో రాణించి అభిమానులకు ఊరట కలిగిస్తాం. విజయం సాధించిన ఆస్ట్రేలియాకు క్రెడిట్ అంతా దక్కుతుంది. ఈ మ్యాచ్‌లో వాళ్లు మమ్మల్ని పూర్తిగా దెబ్బతీశారు. నిజం చెప్పాలంటే ఈ సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించారు. ఇక చివరి రెండు మ్యాచ్‌ల్లో తిరిగి కోలుకోవాలంటే మేం చాలా కష్టపడాల్సి ఉంది. అందుకోసం కచ్చితంగా ప్రయత్నిస్తాం."
-రూట్, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్
31/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ చివరికి 68 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ అరంగేట్రం ప్లేయర్ స్కాట్ బోలాండ్ ఏడు పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శన చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో ఇంగ్లాండ్ తక్కువ స్కోరుకే పరిమితమై ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చెత్త రికార్డు
ఈ పరాజయంతో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టులు(9) ఓడిన జట్టుగా బంగ్లాదేశ్ సరసన నిలిచింది ఇంగ్లాండ్. 2003లో బంగ్లా కూడా తొమ్మిది మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అలాగే, రూట్ ఆస్ట్రేలియాలో 8 టెస్టులకు కెప్టెన్సీ చేపట్టగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం.