Jhulan Goswami Last Match : మ్యాచ్ ఆద్యంతం భావోద్వేగమే. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ ముగిసే వరకు అందరి కళ్లూ జులన్ గోస్వామి మీదే. ఆమె ఎటు కదిలినా కెమెరా అటువైపే! మొత్తం మీద జులన్ కెరీర్‌కు అదిరే ముగింపు! ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న ఈ వెటరన్ పేసర్‌కు భారత మహిళల జట్టు ఘన విజయాన్ని బహుమతిగా అందించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ బృందం 16 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 45.4 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (68 నాటౌట్), స్మృతి మంధాన (50) జట్టును ఆదుకున్నారు. ఇంగ్లిష్ బౌలర్లలో క్రాస్ (4/26), ఎకీల్‌స్టోన్ (2/27) రాణించారు. ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. రేణుక సింగ్ (4/29) ధాటికి 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. 118 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా.. ఛార్లీ డీన్ (47).. చివరి ఇద్దరు బ్యాటర్లతో కలిసి పోరాడి జట్టును విజయానికి చేరువ చేసింది. 17 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుందనగా డీన్‌ను దీప్తిశర్మ రనౌట్ (మన్కడింగ్) చేసి భారత్‌ను గెలిపించింది.
బంతి వేయకుండానే డీన్ క్రీజు వదిలి ముందుకు వెళ్లడాన్ని గమనించిన దీప్తి.. బౌలింగ్ చేస్తున్నట్లుగానే ముందుకు కదిలి ఆమెను రనౌట్ చేసింది. కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పేసర్ జులన్ 10 ఓవర్లలో 3 మొయిడెన్లు వేసి 30 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ ముగిశాక జులన్‌ను చుట్టుముట్టిన భారత అమ్మాయిలు.. ఆమెను భుజాలపైన ఎక్కించుకుని లార్డ్స్ మైదానం చుట్టూ తిప్పారు. అంతకుముందు టాస్ వేసే సమయంలో హర్మన్ తనతో పాటు జులన్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లింది. భారత ఇన్నింగ్స్‌లో జులన్ గోస్వామి బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో ఇంగ్లాండ్ జట్టు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది.
ఆమె ఓ స్ఫూర్తి..
మహిళల క్రికెట్ అనగానే గుర్తొచ్చే పేరు మిథాలిరాజ్! బౌలింగ్‌లో అంతటి స్టార్‌డమ్ పేసర్ జులన్ గోస్వామికి మాత్రమే సొంతం. మిథాలీలాగే సుదీర్ఘమైన కెరీర్‌తో పాటు ఎన్నో ఘనతలను సొంతం చేసుకుందామె. 'ఛాక్డా ఎక్స్‌ప్రెస్'గా ముద్దుగా పిలుచుకునే జులన్.. బాల్ గర్ల్‌గా మొదలై భారత మహిళల క్రికెట్‌పై తనదైన ముద్ర వేసింది. బెంగాల్‌లో చిన్న ఊరి నుంచి వచ్చినా ప్రపంచం తనవైపు చూసేలా చేసిన పేసర్ జులన్.
భారత్‌లో మహిళల క్రికెట్ ఉనికే లేని స్థితిలో కెరీర్ ఆరంభించించింది. తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్లో పేస్ బౌలింగ్ అంటే జులన్ పేరు గుర్తుచ్చే స్థాయికి ఎదిగింది. ఈ స్థాయికి చేరుకునేందుకు ఆమె ఎదుర్కొన్న కష్టాలెన్నో.. పడ్డబాధలు ఇంకెన్నో! 1997లో ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఫైనల్లో బాల్ గర్ల్‌గా పని చేసిన జులన్.. ఎలాగైనా భారత క్రికెట్ జట్టుకు ఆడాలని సంకల్పం ఏర్పర్చుకుంది.
క్రికెట్‌లో శిక్షణ పొందడానికి ఇంటి నుంచి ప్రతిరోజూ దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించేది. ఉదయాన్నే 5 గంటలకే బయల్దేరి 7.30 కల్లా కోల్‌కతాలో వివేకానంద పార్క్‌కు వెళ్లేది. సాధారణ రైలు కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించేది. డార్మెటరీల్లో నిద్రపోయేది. క్రికెట్లో పేరు తెచ్చుకుంటే చాలు అని తపించేది.
ఇంగ్లాండ్‌తోనే మొదలు..
2002లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన ఆమె.. వేగంగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా మారింది. దేశంలో అమ్మాయిల క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్‌కు చిరునామాగా మారింది. క్రమశిక్షణతో కూడిన లైన్ అండ్ లెంగ్త్, మంచి వేగంతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారింది. ముఖ్యంగా జులన్ రనప్, బౌలింగ్ శైలి బ్యాటర్లను కంగారుపెట్టేవి. మెరుపు స్వింగ్ బంతులతో పాటు చక్కని కటర్స్‌తో వికెట్లు సాధించేదామె.
పరిమిత ఓవర్ల క్రికెట్లో గోస్వామి బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు కష్టపడేవాళ్లు. తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో 10 ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది ఈ పేసర్. కెరీర్ ఆఖరి మ్యాచ్‌లోనూ 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 30 పరుగులే ఇచ్చింది. 39 ఏళ్ల వయసులోనూ యువ పేసర్లకు ధీటుగా బౌలింగ్ చేస్తూ క్రికెట్ నుంచి ఘనంగా రిటైరైంది. తనను చూసే పేసర్లుగా ఎదిగిన రేణుక, అరుంధతిరెడ్డి లాంటి అమ్మాయిలతోనూ ఇంకా ఆడుతూ స్ఫూర్తిగా నిలుస్తోంది ఈ వెటరన్ బౌలర్.
పేసర్‌గానే కాదు కెప్టెన్‌గా, లోయర్‌ఆర్డర్‌లో విలువైన బ్యాటర్‌గా రెండు దశాబ్దాల కెరీర్‌లో భిన్నమైన పాత్రలు పోషించింది జులన్. 2002లో ఇంగ్లాండ్‌పై టాంటన్ టెస్టులో మిథాలీరాజ్‌తో కలిసి నెలకొల్పిన 157 పరుగుల భాగస్వామ్యం జట్టును గట్టెక్కించింది. 2006లో ఇంగ్లాండ్ పర్యటనలో తొలిసారి భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన ఆమె.. జట్టు సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.
భారత్ తొలి టెస్టు విజయం అందుకుంది ఈ సిరీస్‌లోనే. టాంటన్ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అయిదు వికెట్ల ప్రదర్శన చేసింది. కెరీర్‌లో ఉత్తమ మ్యాచ్ గణాంకాలు (10/78) నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించింది. ఇలా చెప్పుకుంటూపోతే ఈ పేసర్ కెరీర్‌లో జట్టును గెలిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇంగ్లాండ్‌పై కెరీర్ ఆరంభించిన జులన్.. ఇంగ్లాండ్‌పైనే కెరీర్ ముగించడం విశేషం.
- 255
వన్డేల్లో జులన్ పడగొట్టిన వికెట్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె ఘనత సాధించింది. - 100
వన్డేల్లో 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన 11 మంది క్రికెటర్ల జాబితాలో జులన్ కూడా ఉంది.
- జులన్ నిషిత్ గోస్వామి పుట్టింది: బెంగాల్
- అరంగేట్రం: 2002 ఇంగ్లాండ్‌పై
- వీడ్కోలు: 2022 ఇంగ్లాండ్‌పై
- టెస్టులు: 12; వికెట్లు: 44; పరుగులు: 291
- వన్డేలు: 204; వికెట్లు: 255; పరుగులు: 1228
- టీ20: 68; వికెట్లు: 56; పరుగులు: 405
-
Last over of her international career. JulanGoswami, you are an inspiration for many..‼️👏🏻
— Deepak N (@DeepakN172) September 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy retirement 🙏#JhulanGoswami pic.twitter.com/DE5LscEM8i
">Last over of her international career. JulanGoswami, you are an inspiration for many..‼️👏🏻
— Deepak N (@DeepakN172) September 24, 2022
Happy retirement 🙏#JhulanGoswami pic.twitter.com/DE5LscEM8iLast over of her international career. JulanGoswami, you are an inspiration for many..‼️👏🏻
— Deepak N (@DeepakN172) September 24, 2022
Happy retirement 🙏#JhulanGoswami pic.twitter.com/DE5LscEM8i
-
ఇవీ చదవండి: ఆ రోజు ఫ్యాన్స్‌కు ధోనీ సర్ప్రైజ్.. ఏం ఇవ్వబోతున్నాడో?
హైదరాబాద్‌లో టీ-20 క్రికెట్ మ్యాచ్ సందడి.. హోటళ్లకు చేరుకున్న ఆటగాళ్లు