ఐపీఎల్ 2022కు రంగం సిద్ధమవుతోంది. వచ్చే సీజన్లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇక జనవరిలో జరగబోయే మెగా వేలం(IPL 2022 Mega Auction)పైనే అందరి దృష్టి నెలకొంది. ఏ జట్టు ఏ ఆటగాడిని అట్టిపెట్టుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే కీలక వ్యాఖ్యలు చేశాడు దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(ravi ashwin ipl news). ఈసారి దిల్లీ తనతో పాటు శ్రేయస్‌ను అట్టిపెట్టుకునేందుకు సిద్ధంగా లేదని వెల్లడించాడు.
"శ్రేయస్‌ను ఈసారి దిల్లీ అట్టిపెట్టుకోదు. అలాగే నన్ను కూడా వారు వదిలేయబోతున్నారు. మా స్థానాల్లో ఎవరో ఒకరు వస్తారు. ఒకవేళ నన్ను తీసుకుంటే అది నాకు తెలిసేది కదా!"
-అశ్విన్, దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్
2020 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అశ్విన్‌ను.. ఈ ఏడాది సీజన్‌కు ముందు ట్రేడింగ్ విండో పద్ధతి ద్వారా కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్. ఈ సీజన్లోనూ బంతితో రాణించాడు అశ్విన్. 28 ఇన్నింగ్స్‌లో 20 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
Shreyas Iyer IPL 2022 Team: అలాగే 2015 నుంచి దిల్లీకి ఆడుతున్న శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 2019 నుంచి జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఫైనల్‌కు చేర్చాడు. 2021లో భుజం గాయం కారణంగా ఐపీఎల్ నుంచి శ్రేయస్ వైదొలగడం వల్ల పంత్‌ను కెప్టెన్‌గా చేసింది యాజమాన్యం. ఇతడి సారథ్యంలో జట్టు మంచి ఫలితాలు సాధించడం వల్ల యూఏఈలో జరిగిన రెండో విడతలో శ్రేయస్ అందుబాటులోకి వచ్చినా.. పంత్‌కే కెప్టెన్సీ ఇచ్చింది.
Delhi Capitals Retained Players 2022: ఇక దిల్లీ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల విషయానికి వస్తే కెప్టెన్ పంత్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్జ్టే పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరో ఆటగాడి రేసులో అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్ ఉన్నారు.