గత రెండు మ్యాచ్‌ల్లో విజయానికి చేరువగా వచ్చి చతికిలపడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబయితో మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టాలని చూస్తోంది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు చెన్నె చెపాక్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది వార్నర్ సేన. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే 6 రన్స్‌తో ఓటమిని మూటగట్టుకుంది.
హైదరాబాద్ బోణీ కొట్టేనా?
బ్యాటింగ్‌లో కెప్టెన్ వార్నర్, మనీష్ పాండే, బెయిర్ స్టో ఫర్వాలేదనిపిస్తున్నారు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా నిరాశపరుస్తున్నాడు. మరో బ్యాట్స్‌మన్ విలియమ్సన్ మిడిలార్డర్లో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక బౌలింగ్‌లో రషీద్ ఖాన్, హోల్డర్, నబీ రాణిస్తున్నప్పటికీ.. దేశవాళీ బౌలర్లు ఆకట్టుకోవాల్సి ఉంది. ఇక ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ నెగ్గిన వార్నర్.. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించి ఛేదనలో స్వల్ప తేడాతో పరాజయం చవిచూశాడు.
ఇదీ చదవండి: ప్రోటీస్‌పై పాక్ గెలుపు- టీ20 సిరీస్ కైవసం
ముంబయికి ఎదురుందా?
ఇక ముంబయి విషయానికొస్తే తొలి మ్యాచ్‌లో ఓడినా రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో 10 పరుగులతో గెలిచిన ముంబయి.. ఆత్మవిశ్వాసంతో ఉంది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ కాస్తా రోహిత్ సేన వశమైంది. ఇప్పటికే చెన్నై పిచ్‌పై ఓ మ్యాచ్ గెలవడం ముంబయికి కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్ నెగ్గి.. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లాలని చూస్తోంది రోహిత్ సేన.
బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ రాణిస్తున్నారు. ఓపెనర్ డికాక్ కుదురుకుంటే ముంబయికి శుభారంభాలు దక్కుతాయి. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, పొలార్డ్ విజృంభిస్తే ముంబయికి మరో విజయం దక్కడం ఖాయం.
ఇక బౌలింగ్‌లో బుమ్రా, జాన్సన్, బౌల్ట్, చాహర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్నారు. స్పిన్‌కు సహకరించే చెపాక్ పిచ్‌పై కృనాల్ పాండ్య, చాహర్ ఏ మేర ప్రభావం చూపిస్తారో చూడాలి మరి.
జట్లు (అంచనా)..
ముంబయి ఇండియన్స్:
రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కీరన్ పొలార్డ్, మార్కో జాన్సన్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్:
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా, బెయిర్ స్టో, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, నబీ, భువనేశ్వర్ కుమార్, షాబాద్ నదీమ్, సందీప్ శర్మ.
ఇదీ చదవండి: 'టోక్యో ఒలింపిక్స్ రద్దు ఆలోచనే లేదు'