ఐపీఎల్ 16వ సీజన్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. దిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లఖ్‌నవూ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (56; 48 బంతుల్లో 7 ఫోర్లు) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. రిలీ రోసోవ్ (30) ఫర్వాలేదనిపించాడు. పృథ్వి షా (12), మిచెల్ మార్ష్ (0), సర్ఫరాజ్ ఖాన్ (4), పావెల్ (1), హకీమ్ ఖాన్ (4), అక్షర్ పటేల్ (16), చేతన్ సకారియా (4), కుల్దీప్ యాదవ్ (6*), ముకేశ్ కుమార్ (0*) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. ఇక, దిల్లీ బౌలర్లలో.. మార్క్ వుడ్ 14 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్(73; 38 బంతుల్లో 2x4, 7x6).. విరుచుకుపడ్డాడు. అయితే సెంచరీ చేస్తాడని అనుకున్న సమయంలో అతడిని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. మేయర్స్ ఔట్ అవ్వగానే స్కోరు బోర్డు నెమ్మదిగా నడిచింది. క్రీజులోకి వచ్చినవారు వరుసగా ఫెయిల్ అయ్యారు. నికోలస్ పూరన్(36; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రం కాసేపు క్రీజులో నిలబడి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. చివర్లో ఆయుష్ బదోని(18; 7 బంతుల్లో 2x6, 1x4) కాస్త రాణించడంతో.. లఖ్‌నవూ 193 పరుగుల వద్ద వెనుదిరిగింది. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు తీశారు. అక్సర్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆరెంజ్ పోరు నేడే..
2016లో ఛాంపియన్స్.. వరుసగా నాలుగేళ్లు ప్లేఆఫ్స్.. ఇదీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర. కానీ గత రెండు సీజన్లలో ఘోరంగా వైఫల్యం చెందింది. గత సీజన్లో 10 జట్లలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అంతకుముందు 8 జట్లలో చిట్టచివరి ర్యాంకుకు పరిమితమైంది. ఐపీఎల్లో గత ఏడు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానమిది. ఈ నేపథ్యంలో సరికొత్త సన్‌రైజర్స్ జట్టు.. 2023 సీజన్‌కు సిద్ధమైంది. కొత్త కెప్టెన్.. సరికొత్త కూర్పుతో కనిపిస్తున్న సన్‌రైజర్స్ టీమ్.. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఇదీ చూడండి : IPL 2023: అదిరిపోయే అరంగేట్రం.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో ప్లేయర్‌గా...