ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో భాగంగా కోలకతాతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. కోల్‌కతాకు 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివర్లో విజయ్ శంకర్ చెలరేగిపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది గుజరాత్. విజయ్ శంకర్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. చివరి రెండు ఓవర్లలో 45 పరుగులు వచ్చాయి. అందులో శంకర్ చేసినవే 41 పరుగులు ఉన్నాయి. సాయి సుదర్శన్ (53), శుభ్‌మన్ గిల్ (39) కూడా రాణించారు. వృద్ధిమాన్ సాహా (17), అభినవ్ మనోహర్ (14) పరుగులు చేశారు. ఇక, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ (3) వికెట్లు పడగొట్టి ఆకట్టుకోగా.. సుయాశ్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.
హ్యాట్రిక్ ఫోర్లు, సిక్సులు..
అభినవ్ మనోహర్ క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడు ఆడాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 13 ఓవర్లో తొలి మూడు బంతులను బౌండరీకి పంపించాడు. ఆ తర్వాత రెండు సింగిల్స్ వచ్చాయి. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయిన విజయ్ శంకర్.. చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు.
శుభమన్ గిల్ @2000
యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఐపీఎల్ కెరీర్లో 2000 పరుగులు మార్క్‌ను అందుకున్నారు. ఐపీఎల్లో 77వ మ్యాచ్‌లో 2016 పరుగులు కంప్లీట్ చేసుకుని ఈ ఘనత సాధించాడు. ఇందులో 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గిల్ నిలకడగా ఆడుతూ.. గత మూడు సీజన్లలో 400 పైగా పరుగులు చేశాడు. అందుకే ఐపీఎల్ మినీ వేలంలో గుజరాత్ ఫ్రాంచైజీ.. రూ. 8 కోట్లకు గిల్‌ను కొనుగోలు చేసింది. కాగా, ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే 36 బంతుల్లో 63 పరుగులు చేశాడు గిల్.
సీజన్లోనే ఫాస్టెస్ట్ బాల్..
ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన బాల్ వేసిన ప్లేయర్‌గా నిలిచాడు కోల్‌కతా బౌలర్ లాకీ ఫర్గూసన్. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన ఫర్గూసన్.. రెండో బంతిని గంటకు 154.1 కిలో మీటర్ల వేగంతో సంధించాడు. ఇదే ఓవర్లో మొదటి బంతిని 149 కిలో మీటర్లు, 150.15 కిలో మీటర్ల వేగంతో వేశాడు. కానీ, ఫర్గూసన్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. నాలుగు ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చాడు.