IPL 2022 Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి ఏడు మ్యాచ్‌లను ఓడిపోయిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది ముంబయి ఇండియన్స్. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. గురువారం చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ప్రస్తుత సీజన్లో వరుసగా ఏడో ఓటమిని చవిచూసిన రోహిత్ సేన.. లీగ్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే!
ఈ క్రమంలోనే అంతకుముందు దిల్లీ డేర్‌డెవిల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట సంయుక్తంగా ఉన్న చెత్త రికార్డును ముంబయి అధిగమించింది. 2013లో దిల్లీ, 2019లో ఆర్సీబీ తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఓడి, తమ ఏడో గేమ్‌లో గెలుపు రుచి చూశాయి. ఐపీఎల్లో వరుసగా ఏడు ఓటములు నమోదు చేయడం ఇది 11వ సారి. అయితే టైటిల్ గెలిచిన జట్టుకు ఇలా జరగడం ఇదే తొలిసారి.
ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్!: గురువారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చెన్నై 3 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (51; 43 బంతుల్లో 3×4, 2×6) టాప్ స్కోరర్. ముకేశ్ చౌదరి (3/19) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ధోనితో పాటు రాయుడు (40; 35 బంతుల్లో 2×4, 3×6), ఉతప్ప (30; 25 బంతుల్లో 2×4, 2×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబయి బౌలర్లలో సామ్స్ (4/30) రాణించాడు.
ఇవీ చూడండి:
Mumbai: ఇంకెప్పుడో ముంబయి బోణీ? అలా చేస్తుందా?
MI vs CSK: లాస్ట్ ఓవర్లో చెలరేగిన ధోనీ.. ముంబయికి వరుసగా ఏడో ఓటమి