IPL 2022 RCB Vs GT: బెంగళూరుతో జరిగిన రసవత్తర పోరులో గుజరాత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 171 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు ఉండగానే హార్దిక్ సేన ఛేదించింది. లీగ్‌లో ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని గుజరాత్ టైటాన్స్ మరింత పదిలం చేసుకుంది. తెవాతియా(25 బంతుల్లో 43 నాటౌట్), మిల్లర్ (24 బంతుల్లో 39 నాటౌట్) గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు.
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు కేవలం నాలుగు వికెట్లే కోల్పోయి 19.3 ఓవర్లలో విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య (3) విఫలం అయ్యాడు. తెవాతియా, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా (29), శుభ్‌మన్ గిల్ (31), సాయి సుదర్శన్ (20) రాణించారు. బెంగళూరు బౌలర్లలో షాబాజ్, హసరంగ తలో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో గుజరాత్ (16 పాయింట్లు) ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే.
తొలుత గుజరాత్ బౌలర్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (58), రజత్ పాటిదార్ (52) అర్ధ శతకాలు సాధించగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33) ధాటిగా ఆడాడు. అయితే గుజరాత్ బౌలర్లు పుంజుకోవడం వల్ల బెంగళూరు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది. డుప్లెసిస్ డకౌట్ కాగా.. షాబాజ్ 2*, మహిపాల్ లామ్రోర్ 16 పరుగులు చేశారు. అల్జారీ జోసెఫ్ వేసిన ఓవర్‌లో లామ్రోర్ కొట్టిన బంతి రోప్‌కు తాకడంతో డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టినా అంపైర్లు నాటౌట్‌గా తేల్చారు. అయితే చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన లామ్రోర్ బౌండరీ లైన్ వద్ద మిల్లర్‌కే చిక్కాడు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ 2.. షమీ, అల్జారీ జోసెఫ్, ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.
ఇదీ జరిగింది: IPL 2022: అది ఉంటే ఎలాంటి మ్యాచ్‌నైనా గెలవచ్చు!