కరోనాతో ఐపీఎల్ 14న సీజన్‌ను వాయిదా వేశారు. దీంతో క్రికెట్ ప్రేమికులు నిరాశలో మునిగిపోయారు. అయితే లీగ్ వాయిదా పడటం వల్ల కొన్ని జట్ల ఆటగాళ్లు బాధపడుతుంటే మరికొందరు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సీజన్లో వారు ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్నారు. తిరిగి ప్రారంభమయ్యే లీగ్‌లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. వారెవరో చూద్దాం.
డేవిడ్ వార్నర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు ఈ సీజన్ పీడకల అనే చెప్పాలి. రెండేళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వార్నర్‌ను ఈ ఏడాది సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది ఫ్రాంచైజీ. ఈ సీజన్లో అతడు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఐదింటిలో ఓడిపోవడమే ఇందుకు కారణం. అలాగే బ్యాట్స్‌మన్‌గానూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 110.28 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలూ ఉన్నాయి. చివరగా చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో 57 బంతులలో 55 పరుగులు చేశాడు. బౌండరీలు సాధించడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత ఇతడు కెప్టెన్సీతో పాటు జట్టులో చోటూ కోల్పోయాడు. ఇతడిని సన్‌రైజర్స్ జెర్సీలో చూడడం ఇదే చివరిసారని వార్తలు వస్తున్నాయి.
శార్దూల్ ఠాకూర్
ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఐపీఎల్లో భారీ అంచనాలతో అడుగుపెట్టాడు చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ శార్దూల్ ఠాకూర్. కానీ లీగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 10.33 ఎకానమీతో కేవలం ఐదు వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. ఈసారి లీగ్‌లో ఎక్కువ ఫోర్లు (29) అప్పజెప్పిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టున్నాడు. దిల్లీ, ముంబయితో జరిగిన మ్యాచ్‌ల్లో 50కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఇయాన్ మోర్గాన్
భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఫామ్ లేమితో సతమతమైన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఐపీఎల్లో అదే తీరును కనబర్చాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 112.19 స్ట్రైక్ రేట్‌తో కేవలం 92 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచినా.. మిగతా మ్యాచ్‌ల్లో మాత్రం విఫలమయ్యాడు.
కగిసో రబాడ
గతేడాది అత్యధిక వికెట్లతో సత్తాచాటి పర్పుల్ క్యాప్ దక్కించుకున్న దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడ ఈ సీజన్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఇతడి స్లో బాల్స్, యార్కర్స్ను సరిగ్గా అంచనా వేసిన బ్యాట్స్‌మెన్ ఇతడి బౌలింగ్‌ను చితక్కొట్టారు. దిల్లీ కొత్త కెప్టెన్ పంత్, రబాడ మధ్య సమన్వయ లోపం కూడా ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 8.76 ఎకానమీతో 8 వికెట్లు దక్కించుకున్నాడు.
నికోలస్ పూరన్
ఐపీఎల్ 2021 పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌కు అసలు కలిసిరాలేదనే చెప్పాలి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 28 పరుగులే చేసి దారుణంగా నిరాశపర్చాడు. ఇందులో నాలుగుసార్లు డకౌట్ కావడం గమనార్హం. అయినా ఇతడి మీద నమ్మకం ఉంచింది ఫ్రాంచైజీ. లీగ్ తిరిగి ప్రారంభమయ్యాక తన ఫామ్‌ను తిరిగి దక్కించుకోవాలని పూరన్ ఆశపడుతున్నాడు.