యూఏఈలో ఐపీఎల్-14 రెండో అంచెను(IPL 2nd Phase 2021) ఆర్‌సీబీ పేలవంగా ఆరంభించింది. సోమవారం ఆ జట్టు 9 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్(RCB Vs KKR 2021) చేతిలో ఘోర పరాజయం పాలైంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/13).. పేసర్లు ఆండ్రి రసెల్ (3/9), లోకీ ఫెర్గూసన్ (2/24) విజృంభించడం వల్ల బెంగళూరు 19 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. 22 పరుగులు చేసిన ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కలే టాప్‌స్కోరర్. ఆ జట్టులో రెండంకెల స్కోరు చేసింది నలుగురే. అనంతరం ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (48; 34 బంతుల్లో 6×4, 1×6), వెంకటేశ్ అయ్యర్ (41 నాటౌట్; 27 బంతుల్లో 7×4, 1×6) చెలరేగి ఆడటం వల్ల కోల్‌కతా 10 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
పిచ్ మార్చేశారా..?
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభమయ్యాక.. ఆ జట్టు ఓపెనర్లు ఆడుతోంది బెంగళూరు బ్యాటింగ్ చేసిన పిచ్ మీదేనా లేక కొత్త పిచ్‌పై ఆడించారా అనిపించింది. అంతలా చెలరేగిపోయారు శుభ్‌మన్, వెంకటేశ్. గాయం నుంచి కోలుకుని జట్టు అంతర్గత మ్యాచ్‌లో చెలరేగి ఆడిన గిల్(Shubman Gill Innings Today).. ఈ పోరులోనూ చెలరేగిపోయాడు. పేస్, స్పిన్ అని తేడా లేకుండా అందరి బౌలింగ్‌నూ అతను చితగ్గొట్టేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఆశ్చర్యకర బ్యాటింగ్ అంటే కొత్త కుర్రాడు వెంకటేశ్ అయ్యర్‌దే(Venkatesh Iyer Batting). ఐపీఎల్‌లో(IPL 2021) తొలి మ్యాచ్ ఆడుతున్నా.. ఏమాత్రం తడబాటు లేకుండా అతను బ్యాటింగ్ చేశాడు. చాలా బలంగా బంతిని బాదుతూ బౌండరీలు రాబట్టాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ ఔటయ్యాడు. కోల్‌కతా 10 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించేసింది.
ఏదో అనుకుంటే..
అంతకుముందు ఆర్‌సీబీ ఇన్నింగ్స్ అంతా ఆపసోపాలే. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌తో ఆటాడుకున్నాడు. అతను వేసిన 24 బంతుల్లో 15 డాట్ బాల్స్ కావడం గమనార్హం. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో అతను బెంగళూరును మామూలు దెబ్బ కొట్టలేదు. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడని ఆర్‌సీబీ ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్(10)ను బౌల్డ్ చేయడమే కాక.. తర్వాతి బంతికే హసరంగను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. హ్యాట్రిక్‌పై నిలిచిన అతను జేమీసన్‌ను కూడా ఎల్బీగా ఔట్ చేసినట్లే కనిపించాడు. కానీ బంతి కొద్దిగా బ్యాట్ అంచును తాకడం వల్ల హ్యాట్రిక్ తప్పింది. తర్వాత వరుణ్ సచిన్ బేబీ(7)ని కూడా బౌల్డ్ చేశాడు.
అసలు ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచీ ఒడుదొడుకులతోనే సాగింది. కోహ్లీ కొత్త జెర్సీలో ఉత్సాహంగా వచ్చి టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకోవడం వల్ల పరుగుల పండుగే అనుకున్నారు ఆర్‌సీబీ అభిమానులు. కానీ రెండో ఓవర్లోనే బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. కెప్టెన్ కోహ్లీ(5) వికెట్‌ను ప్రసిద్ధ్ పడగొట్టాడు. దేవ్‌దత్ పడిక్కల్ (22), శ్రీకర్ భరత్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే కుదురుగా ఆడుతున్న పడిక్కల్‌ను ఫెర్గూసన్ ఔట్ చేయడం వల్ల ఇన్నింగ్స్ గాడితప్పింది. రసెల్.. తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో భరత్ (16), డివిలియర్స్ (0)లను ఔట్ చేసి బెంగళూరును గట్టి దెబ్బ తీశాడు. ఏబీని కళ్లు చెదిరే యార్కర్‌తో అతను బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్. ఇక్కడి నుంచి బెంగళూరు ఎంతమాత్రం కోలుకోలేకపోయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి ఎల్బీ (బి) ప్రసిద్ధ్ 5; పడిక్కల్ (సి) కార్తీక్ (బి) ఫెర్గూసన్ 22; భరత్ (సి) శుభ్‌మన్ (బి) రసెల్ 16; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 10; డివిలియర్స్ (బి) రసెల్ 0; సచిన్ బేబీ (సి) నితీశ్ (బి) వరుణ్ 7; హసరంగ ఎల్బీ (బి) వరుణ్ 0; జేమీసన్ రనౌట్ 4; హర్షల్ (బి) ఫెర్గూసన్ 12; సిరాజ్ (సి) వరుణ్ (బి) రసెల్ 8; చాహల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (19 ఓవర్లలో ఆలౌట్) 92; వికెట్ల పతనం: 1-10, 2-41; 3-51, 4-52; 5-63, 6-63, 7-66, 8-76, 9-83; బౌలింగ్: వరుణ్ చక్రవర్తి 4-0-13-3; ప్రసిద్ధ్ కృష్ణ 4-0-24-1; లోకీ ఫెర్గూసన్ 4-0-24-2; నరైన్ 4-0-20-0; రసెల్ 3-0-9-3.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుభ్‌మన్ (సి) సిరాజ్ (బి) చాహల్ 48; వెంకటేశ్ అయ్యర్ నాటౌట్ 41; రసెల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (10 ఓవర్లలో వికెట్ నష్టానికి) 94; వికెట్ల పతనం: 1-82; బౌలింగ్: సిరాజ్ 2-0-12-0; జేమీసన్ 2-0-26-0; హసరంగ 2-0-20-0; చాహల్ 2-0-23-1; హర్షల్ పటేల్ 2-0-13-0.
ఇదీ చూడండి.. IPL 2021 News : ఆర్సీబీపై కోల్‌కతా ఘన విజయం